కలం, నిజామాబాద్ బ్యూరో : రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ధ్వజమెత్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని కొనియాడారు.
వందేళ్ళ తర్వాత కూడా దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి, ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ ముందు చూపుతో మనకు అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. నాడు ఒక రాష్ట్రం నుండి మరొక ప్రాంతం విడిపోవాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి తప్పనిసరి అని వాదించినప్పటికీ, అంబేద్కర్ తన దూరదృష్టితో చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ‘ఆర్టికల్-3 ని పొందుపరిచారని గుర్తుచేశారు. ఆనాడు ఆంధ్రా పాలకులు తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా పార్లమెంట్ నిర్ణయంతో తెలంగాణ రావడానికి కారణం ఆ ఆర్టికల్-3 మాత్రమేనని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా రాజ్యాంగ స్ఫూర్తితో దేశం ముందుకు వెళ్తోందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని అపశృతులు దొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులను, సిట్ (SIT)లను, కమిషన్లను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులను విచారణల పేరుతో వేధించడం సరికాదన్నారు. సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో జరిగిన భారీ అవినీతిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి బంధువుల హస్తం ఉందని ఈ విషయంపై హరీష్ రావు (Harish Rao) ప్రశ్నిస్తే ఆయనకు, కేటీఆర్ కు (KTR) నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఈ కుంభకోణంపై ‘సిట్టింగ్ జడ్జి’తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సిట్ (SIT) లు, కమిషన్ల పేరుతో ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయవద్దని హెచ్చరించారు. అధికారులు, పాలకులు, ప్రతిపక్షాలు అందరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితోనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకొని, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని హితవు పలికారు. లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పోరాడి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని, ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) హెచ్చరించారు.
Read Also: ఆ రోజులు మరపురానివి.. పరేడ్ ఫొటోలు షేర్ చేసిన కిరణ్ బేడీ
Follow Us On : WhatsApp


