కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ జన సమితి పార్టీ (Telangana Jana Samithi Party) అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్(Congress)తో కలిసి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇంతకాలం కలిసి ప్రయాణించామని, ఇకపై కూడా కలిసే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. కొన్నిచోట్ల అయినా తమ పార్టీ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. తమ పార్టీ కేడర్‌లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పార్టీ సభ్యులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం అన్నారు.
సింగరేణి వ్యవహారంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు లబ్ధి పొందాలని చూస్తున్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కోదండరాం (Kodandaram) అన్నారు. కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దక్కుతుంటే కార్మికులకు నెలవారీ ఖర్చులకు కూడా సరిపోని డబ్బులు వస్తున్నాయని చెప్పారు. సింగరేణి సంపదలో కొంత వాటా అక్కడి కార్మికులకు దక్కడమే సరైందన్నారు. సింగరేణి బొగ్గుపై సంపూర్ణ అధికారాన్ని సింగరేణికే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ ప్రైవేటు వ్యక్తుల జీవితం మీద పెత్తనం కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదని, వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పారు.
Read Also: ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న రేవంత్ సర్కార్ : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


