కలం, నిజామాబాద్ బ్యూరో : పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో ఈ-నామ్ విధానం ద్వారా కాకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు జరగడం వల్ల రైతులు మద్దతు ధర పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నిజామాబాద్ గంజ్‌లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన (MLA Prashanth Reddy) విమర్శించారు. పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మార్కెట్ యార్డ్‌కు భారీగా పసుపు పంట వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని వేలెత్తి చూపారు.
రైతులు తమ పంట అమ్ముకోవడానికి మూడు నాలుగు రోజుల పాటు మార్కెట్ యార్డ్‌లో వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు. ఇక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఉండి కూడా లాభం లేకుండా పోయిందన్నారు. పసుపు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. ఇటీవల ఎంపీ అరవింద్ “ఈ-నామ్ 1.5” కింద కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికి కార్యరూపం దాల్చలేదన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోళ్లు నిలిపివేసి బహిరంగ వేలం నిర్వహించడం అన్యాయమని దుయ్యబట్టారు. మొదట “ఈ-నామ్ సాఫ్ట్ వేర్ 2.5” గురించి మాట్లాడి, తర్వాతసాఫ్ట్ వేర్ర్ “1.5” అని చెప్పడం వల్ల రైతుల్లో గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా మారిందని, చేపల మార్కెట్ మాదిరిగా బహిరంగ వేలం ద్వారా దళారులు కుమ్మక్కై తక్కువ ధరలకు పసుపు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
దీనివల్ల రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని.. దళారులకు లాభం చేకూరుతోందని ఆరోపించారు. మార్కెట్ యార్డ్‌కు పసుపు తీసుకువచ్చిన రైతులు రోజుల తరబడి సరైన ధర కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బహిరంగ వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ-నామ్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని ఆన్లైన్ విధానంలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతులకు మద్దతు ధర కల్పించి పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న పసుపు రైతులకు BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని రైతులకు భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

