ఖమ్మంలో అలర్ట్.. గంజాయి కట్టడికి ప్రత్యేక నిఘా

కలం, ఖమ్మం బ్యూరో: జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) ఆదేశాల మేరకు ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలో పోలీసులు బుధవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ముదిగొండ (Mudigonda), వైరా (Wyra) ప్రాంతాలలో చేపట్టిన ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ముదిగొండ మండలంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో సీఐ వడ్డేపల్లి మురళీ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహించారు.

పారిశ్రామిక ప్రాంతాలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారి పూర్తి వివరాలను సేకరించారు. అంతర్రాష్ట్ర నేరస్థుల కదలికలపై నిఘా ఉంచడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడమే ఈ తనిఖీల ఉద్దేశమని సీఐ తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఇదిలా ఉండగా, వైరా ప్రాంతంలో గంజాయి విక్రయాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కిరాణా దుకాణాలు, పాన్ షాపుల ముసుగులో చాక్లెట్‌లు, సిగరెట్లు, పౌడర్ రూపంలో యువతకు, విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో వైరా ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్కూళ్లు, కళాశాలల పరిసర ప్రాంతాలు, గంజాయి విక్రయాలకు అనుమానిత హాట్‌స్పాట్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి చట్టాలను ప్రయోగిస్తామని ఎస్ఐ రామారావు హెచ్చరించారు. ప్రజల భద్రత, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>