కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(SIR) ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విజ్ఞప్తి చేశారు. ‘సర్ ను లైట్ తీసుకుంటే.. మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది’ అని హెచ్చరించారు. సర్ ప్రక్రియను ఎవరూ లైట్ తీసుకోవద్దని కోరారు. ‘మీ ఓటును కాపాడుకోండి… మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి’ అని పిలుపునిచ్చారు.
బుధవారం కరీంనగర్ చైతన్యపురిలోని సాధన స్కూల్ లో ఉన్న బీఎల్ వో అధికారులకు సర్ పారం సమర్పించారు. అక్కడే ఆన్ లైన్లోనూ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ ఎలా కొనుసాగుతోంది? ఎన్యుమరేషన్ దరఖాస్తులను అందరికీ పంపిణీ చేశారా? ఎంత మంది ఎన్యుమరేషన్ దరఖాస్తులను నింపి అందజేశారు? ఈ విషయంలో ఓటర్లు పడుతున్న ఇబ్బందులేమిటి? అనే వివరాలను బండి అడిగి తెలుసుకున్నారు. ఈనెల 24లోపు ఎన్యుమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం మంది ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫాంలను అందజేశారని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర ప్రజలంతా సర్ ప్రక్రియలో పాల్గొనాలి. ఈనెల 24 వరకు సమయం ఉందని నిర్లక్ష్యం చేయకండి! చివరి రోజు కోసం ఎదురుచూడకండి. ఈ రోజే ఎన్యుమరేషన్ ఫారమ్ నింపండి… మీ ఓటును కాపాడుకోండి. అలాకాకుండా ఇంట్లో కూర్చుంటే… రేపు ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత ‘‘లిస్టులో మీ పేరు గల్లంతవుతుంది. అందుకే చేతిలో ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు… ఓటరు జాబితాలో పేరు ఉండాలి. అందులో భాగంగా బీఎల్ఓ మీ ఇంటికి వస్తే సహకరించండి. సర్ ఫారమ్ తీసుకోండి. వివరాలు సరిచూసుకోండి. ఫారమ్ నింపి గడువులోగా అందించండి’ అని బండి సంజయ్ సూచించారు.
సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు… ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం అని తెలిపారు. సర్ ఫారమ్‌ను నిర్లక్ష్యం చేస్తే రేపు పోలింగ్ బూత్ దగ్గర పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చన్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల సర్ పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మజ్లిస్ తో కుమ్మక్కై హిందువుల ఓట్లను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదముంది అని హెచ్చరించారు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

