కలం, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘సర్’ (Telangana SIR) ప్రక్రియ గడువును పది రోజులపాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల నుంచి వరుస విజ్ఞప్తులు రావడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ గత నెల 25న ప్రారంభం కాగా ఈ నెల 24 వరకు కొనసాగనున్నది. కానీ చాలా ప్రాంతాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వలేదని, ఇచ్చిన ఫారాలను తిరిగి తీసుకెళ్లలేదని పలు పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి కొందరు రాతపూర్వకంగానే ఫిర్యాదు చేశారు. ‘సర్’ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నందున ఎలక్షన్ కమిషన్ రూపొందించిన షెడ్యూలు ప్రకారం జూలై 24కు ముగియాల్సిన గడువును కనీసం నెల రోజుల పాటు పొడిగించాలని సీఈఓకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తానని, నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడేనని ‘మీట్ ది ప్రెస్’లో సీఈఓ తెలిపారు. తాజా వివరాల ప్రకారం ‘సర్’ ప్రక్రియ పది రోజుల పాటు పొడిగించేలా, వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగేలా ఉత్తర్వులు వెలువడే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది.
ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా..
అర్బన్ ప్రాంతాల్లో చాలా ఇండ్లకు ఇప్పటివరకు బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతీ ఇంటికి వెళ్లి ఫారాలను ఇచ్చి వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సిన బీఎల్వోలు కొన్ని కాలనీల్లో ఒకే చోట కూర్చుని ఇండ్లల్లో ఇవ్వకుండా సొంతంగా వారే భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని సీఈఓ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా, చాలా అర్బన్ ప్రాంతాల్లో బీఎల్ వోలు స్థానికులు కాదని, బయట ప్రాంతాలకు చెందినవారని, అడ్రస్ కనుక్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ కారణంగానే ఇండ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నదని, ప్రక్రియపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినా అడ్రస్‌లు, ఇంటి నంబర్లు, వీధి పేర్ల విషయంలో చిక్కులు ఎదురవుతున్నారని తెలిపారు. ఓటర్లందరి వివరాలు సేకరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్, బీఎల్వోలదే కావడంతో రాష్ట్రంలోని ఆచరణాత్మక ఇబ్బందులను ఈసీకి వివరిస్తానని బదులిచ్చారు.
గడువు పెంచండి.. పొన్నం రిక్వెస్ట్
ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని పొన్నం పేర్కొన్నారు. కేవలం 21 శాతమే పూర్తయిందని ఆ మెమొరాండంలో పేర్కొన్నారు. ఇంకో పది రోజుల గడువే ఉన్నదని, దాదాపు 80% ప్రక్రియ కంప్లీట్ కావాలంటే ఈ టైమ్ సరిపోదని సీఈఓకు వివరించారు. సీఈఓను కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు 4,500 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పట్టణ ప్రాంతాల్లో ఓటరు సవరణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. “ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు” అనే ప్రచారం ప్రజల్లో జరుగుతున్నదని , దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీఈఓను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీగణేష్, నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ రాజేష్ తదితరులు ఉన్నారు.
పది రోజులు పొడిగింపు ?
ఓటర్ల జాబితాను పటిష్టంగా, సమగ్రంగా రూపొందించాలన్నది ఎలక్షన్ కమిషన్ లక్ష్యం కావడంతో ఈ నెల 24న ముగియాల్సిన ‘సర్’ గడువును పది రోజులు పొడిగించి వచ్చే నెల 3వ తేదీ వరకు కంటిన్యూ చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ నెల 14తో ముగియాల్సిన గడువును పది రోజులపాటు పొడిగించి ఈ నెల 24వ తేదీ వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి నిర్ణయమే వెలువడుతుందని, షెడ్యూలు ప్రకారం గడువు ముగిసే రోజున , లేదంటే దానికి ఒక రోజు ముందు ఈసీ నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది.

