కలం, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి వెళ్ళిన వంశీ, తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ముఖ్యంగా గత రెండు రోజులుగా తాను మద్యం తాగుతున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు ఫొటోలు, పోస్టుల ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సోషల్ మీడియా గ్రూపులే కాకుండా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కూడా నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే సదరు యూట్యూబ్ ఛానళ్లకు ఆయన ఇప్పటికే లీగల్ నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వంశీ (Vallabhaneni Vamsi) పోలీసు యంత్రాన్ని కోరారు.
Read Also: నారా లోకేశ్‌కు ప్రమోషన్.. పవన్ కళ్యాణ్ అభినందనలు
Follow Us On : WhatsApp

