కలం, వరంగల్ బ్యూరో: సమక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పిలుపు నిచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో బుధవారం జాతరను కవరేజ్ చేస్తున్న వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులకు మంత్రి టీషర్ట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంమైన సమక్క సారలమ్మ జాతరకు భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయింది. ములుగు (Mulugu) జిల్లాలో నిర్వహించే జాతరలో ప్రస్తుత సంవత్సరం అనేక మార్పులు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆదివాసుల అస్థిత్వం, ఆత్మగౌరవం, పూజ విధానంలో మార్పు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు.
జాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ, మెరుగైన పారిశుధ్య చర్యలు, విద్యుత్ దీపాలంకరణ, క్యూ లైన్ సౌకర్యాలు మెరుగయ్యాయని వివరించారు. సమ్మక్క సారలమ్మ జాతర తీసుకొచ్చే విధానం పూజ వ్యవహారాలలో ఎటువంటి మార్పు రాలేదు. 4 రోజులు జరిగే సమక్క సారలమ్మ జాతరకు ప్రస్తుత సంవత్సరం 40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన టాయిలెట్స్, త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు అదనపు కార్మికులను ముందుగానే జాతర స్థలం వద్ద సిద్ధం చేశామని తెలిపారు.
సమక్క సారలమ్మ జాతరకు ఇప్పటి వరకు 20 లక్షల భక్తులు వచ్చారని అంచనా వేశాము. సమక్క సారలమ్మ జాతర కవర్ చేసే అదృష్టం పాత్రికేయులకు కలిగిందని, జాతర ఔన్నత్యం గొప్పతనాన్ని బయట ప్రపంచానికి మీడియా చాటి చెప్పాలని మంత్రి తెలిపారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మీడియాకు సైతం పెద్ద హాల్, మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు, వెంకట సురేష్ సంబంధించిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.


