హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యం.. గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ఫోకస్

కలం, కరీంనగర్ బ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు (Gouravelli Project) ను పూర్తి చేసి హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి సంబంధించి రైతులు సహకరించాలని మంత్రి కోరారు. భూసేకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అందరూ సహకరిస్తే, భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు.

గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ

గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని మంత్రి అన్నారు. కొండాపూర్ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వైద్య సేవలు, అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. గ్రామంలో ఆయిల్‌ఫామ్ సాగును విస్తృతంగా చేపట్టి రైతులు అధిక లాభాలు పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. ఆయిల్‌ఫామ్ సాగుతో ఎకరానికి సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కొండాపూర్ గ్రామంలో ఇప్పటికే 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నాయని అధికారులు వివరించారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గుడిసెల్లో నివసిస్తున్న ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.

గ్రామంలో గుడాల భాగ్య అనే లబ్ధిదారు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేశారు. పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాన్ని కూడా ప్రారంభించారు.

ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకోవడమే ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను మంత్రి స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల, డీపీవో జగదీశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ మర్క రాజ్‌కుమార్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>