నీట్ పీజీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లపై పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రత, విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 360 మంది అభ్యర్థులు నీట్ పీజీ పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్పై కెమెరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు/ఇయర్‌పీస్‌లు, బ్లూటూత్ పరికరాలు, స్పై కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలు తదితర నిషేధిత వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

అభ్యర్థులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లను వినియోగించాలని ఆదేశించారు. మహిళా అభ్యర్థుల తనిఖీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులు, ఆధార్/బయోమెట్రిక్ ధృవీకరణ తదితర నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. నోడల్, మానిటరింగ్ అధికారులు నియామకం పరీక్షల నిర్వహణకు స్థానిక సంస్థల అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా పరీక్ష సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అవసరమైన వాహనాలు, రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి నిర్మల, డీఎస్పీ రమణా రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>