Mobile Popup Ad
Mobile Popup Ad

సోలార్ ప్లాంట్ పెట్టండి.. లాభాలు ఆర్జించండి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. 1 మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఒక్కో సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు నాబార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సక్రమంగా ఈఎంఐ చెల్లించే సహకార సంఘాలకు 1 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయన్నారు.

బుధవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ముందుగా జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జన ఔషధి కేంద్రానికి వస్తున్న ఆదరణపై ఆరా తీశారు. అతి తక్కువ ఖర్చుతో జన ఔషధిలో మందులు అందుబాటులో ఉన్నాయని, వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పీఎం కుసుం పథకంలో భాగంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహిస్తోందని అన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80 శాతానికి పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిసారి చొప్పదండిలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు కావడం అభినందనీయమని, ఈ ప్లాంట్ ద్వారా 1 మెగావాట్ కరెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఒక్కో యూనిట్ ను రూ.3 చొప్పున విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయని తెలిపారు.

వాస్తవానికి 1 మెగావాట్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 3 కోట్ల 80 లక్షలు. సహకార సంఘం రూ. 40 లక్షలు వెచ్చించాలి. మిగిలిన రూ. 3 కోట్ల 40 లక్షలు 4 శాతం వడ్డీతో నాబార్డ్ సంస్థ రుణం రూపంలో ఇస్తోంది. ఒకవేళ సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తే 3 శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తుంది. అంటే ఒక శాతానికే లోన్ వచ్చినట్లవుతుంది. సోలార్ ప్లాంట్ ద్వారా ఒక్కో సహకార సంఘానికి ఏటా రూ. 50 లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 సోలార్ ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి కరీంనగర్ లోని చొప్పదండిలో (Choppadandi) ఏర్పాటైంది. కాగా మిగిలినవి పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా పెట్టుకుంటే 9 శాతం వడ్డీతో రుణం లభిస్తుంది. సక్రమంగా కడితే 3 శాతం మినహాయాంపు ఉంటుంది. సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే 3 ఎకరాల స్థలం అవసరం. తద్వారా 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఏటా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. భూమి లభ్యత కలిగిన వారు వెంటనే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు.

Read Also: సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>