కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల (Velugumatla )లో ఇళ్లు కోల్పోయిన భూదాన బాధితులకు తక్షణమే అదే ప్రాంతంలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డా. భీమ్ రావ్ యశ్వంత్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన జేఏసీ ఆధ్వర్యంలో శనివారం వేలాదిమంది భూదాన బాధితులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 15 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడమే కాకుండా రాష్ట్రపతిని కలిసి బాధ్యులైన అధికారులపై చర్యలు కోరతామని స్పష్టం చేశారు.
ఈ సభలో పాల్గొన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, వెలుగుమట్ల భూదాన వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ పరిశీలనలో భూ ఆక్రమణల కోసమే ఈ కుట్ర జరిగిందని తేలిందన్నారు. బాధితులకు న్యాయపరంగా అండగా ఉంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు.
జేఏసీ పోరాటం వల్లే ఇప్పటివరకు 311 మందికి ఇళ్లు మంజూరయ్యాయని, మిగిలిన వారికీ వెలుగుమట్లోనే ఇళ్లు ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పాదయాత్ర చేపడతామని డా. విశారదన్ మహరాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పీఐ నాయకుడు మేజర్ చంద్రకాంత్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల ముదిరాజ్ రాఘవేంద్ర, న్యాయవాది పంజాకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

