కలం, వనపర్తి: గ్రామాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Thudi Megha Reddy) అన్నారు. శనివారం ఏదుల, రేవల్లి మండలాల్లో రూ.3.40 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఏదుల మండల కేంద్రంలో రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దీంతో రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అనంతరం రూ.65 లక్షలతో ఆల్టర్నేట్ విద్యుత్ లైన్ పనులు, రూ.24 లక్షలతో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు రూ.8 లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రేవల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రూ.18 లక్షలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో గ్రామీణ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్, వైద్యం, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పారదర్శక పాలనతో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి విటోబా, సింగిల్ విండో అధ్యక్షుడు రఘు, మండల అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి, సర్పంచ్ పరుశురాం, కొంకి వెంకటేష్, కోళ్ల వెంకటేష్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

