కలం, ఖమ్మం బ్యూరో: మిషన్ భగీరథ పైపులైన్ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni ) అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పాల్వంచ పట్టణ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ పనుల కారణంగా ధ్వంసమైన రోడ్లను ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్ల దుస్థితిని, పైప్‌లైన్ల లీకేజీలను చూసి కూనంనేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు ధ్వంసమై, లీకేజీల వల్ల ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు తక్షణమే స్పందించకపోవడం సరైంది కాదని హితవు పలికారు.
యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసి, లీకేజీలను అరికట్టి, ప్రజల ఇబ్బందులను తొలగించి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో తాను మళ్లీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన (MLA Kunamneni) హెచ్చరించారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారి పరిధిలోకి వస్తుందని, అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో తక్షణమే సిమెంట్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: అక్రమ ఆస్తుల కేసు.. చంచల్‌గూడ జైలుకు సుంకరి నరహరి
Follow Us On: Instagram

