కలం, వరంగల్ బ్యూరో : రేపటి నుంచి మేడారం మహాజాతర (Medaram Jathara) ప్రారంభం కాబోతోంది. జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి భక్తులు తరలి రాబోతున్నారు. ఈ మహా జాతరకు 2 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనేక మంది నెలరోజుల ముందు నుంచే గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం. రేపటి నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.
రేపు సారలమ్మ, ఎల్లుండి సమ్మక్క..
జనవరి 28న సారలమ్మ, జనవరి 29న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించగా.. జనవరి 31న దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే జాతర (Medaram Jathara)ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి.
పకడ్బందీగా ఏర్పాట్లు..
జాతర విధుల్లో పోలీసు శాఖది కీలక పాత్ర. ఈ జాతర ముగిసే వరకు 25 మంది ఐపీఎస్ల పర్యవేక్షణలో 13 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ సీపీ, రామగుండం సీపీ పర్యవేక్షణలో గద్దెలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జాతర కోర్ ఏరియాలో భక్తుల రద్దీ నియంత్రణ విభాగాలు పని చేసేలా కసరత్తు చేశారు. అలాగే జాతరలో పాత నేరస్తుల సంచారం, తప్పిపోయిన వారి గుర్తింపు, దర్శన సందర్భంలో రద్దీ, ట్రాఫిక్ సమస్యలను గుర్తించేలా అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి కోసం 20 డ్రోన్ కెమెరాలు, 450 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానించి నిఘా ఉంచుతున్నారు.
సౌకర్యాలు ఇలా..
ఇక్కడ గతంలో ఏకకాలంలో అమ్మవార్ల గద్దెలను 2000 మంది దర్శించుకుంటే ప్రాంగణం రద్దీగా మారేది. కానీ ఇప్పుడు ప్రాంగణం విస్తరణతో ఒకేసారి 8-9 వేల మంది దర్శించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. గతంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల పక్కన పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలుండేవి. భక్తులు ఆ ప్రాంగణం లోపల వెనక్కి ముందుకు తిరిగేవారు. పునర్నిర్మాణంతో గద్దెలన్నీ ఒకే వరుసలోకి రావడంతో ఆ సమస్య రాదని చెబుతున్నారు. జాతరలో భక్తుల రద్దీ అనుగుణంగా ప్రైవేటు వాహనాలకు ఊరట్టం గ్రామం వద్ద 33 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అలాగే గద్దెలకు సమీపంలోనే ఆర్టీసీ బస్టాండ్, వీఐపీ వావానాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.
జాతర తేదీల్లో 3 లక్షల వాహనాలొచ్చినా నిలిపేందుకు సుమారుగా 2 వేల ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సారి 500 బస్సులు పెంచనున్నారు. మహిళలకు ఆధార్ గుర్తింపుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుంది. మొబైల్ సిగ్నల్ కోసం బీఎస్ఎన్ఎల్ 10 తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేసింది. మేడారం మహాజాతరకు చేరుకొనే మార్గంలో 39 చోట్ల రహదారులను అభివృద్ధి చేశారు. అంతేకాదు తాడ్వాయి, పస్రా, బయ్యక్కపేట మార్గాల్లో ఇరుకు రోడ్లను విస్తరించారు. మేడారంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. జంపన్న వాగు వద్ద ఏర్పాట్లను ఆధునికీకరించారు. మేడారంలోని రెండు 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. నార్లాపూర్ వద్ద మరో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించారు. విద్యుత్త్ కోసం 259 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగుపై నుంచి వెళ్లే లైన్ల కోసం ఎత్తయిన టవర్లను కూడా నిర్మించారు.
జిల్లాల వారీగా రూట్ మ్యాప్..
ఖమ్మం, నల్లొండ, హైదరాబాద్, మెదక్, వరంగల్ ప్రాంతాల వారంతా ములుగు, పస్రా మీదుగా రావాలి.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వాసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, తాడ్వాయి మండలం కాల్వపల్లి మీదుగా మేడారం సమీప ఊరట్టం స్థూపం వద్దకు చేరుకోవాలి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సహా భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చే వారు ఏటూరునాగారం వైపు నుంచి కొండాయి మీదుగా వెళ్లాలి.
ఇక తిరుగు ప్రయాణంలో వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ములుగు మీదుగా కాకుండా బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి వైపు నుంచి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మహాజాతరకు విస్తృత ఏర్పాట్లు..
మేడారం జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 2 వేల మంది ఆదివాసీ వలంటీర్లు విధుల్లో ఉంటారు.
27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశారు.
1418 ఎకరాల్లో 42 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.
4 వేల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉంటారు.
5,482 తాగు నీటి పాయింట్లు ఉంటాయి.
జంపన్న వాగు వద్ద 119 డ్రెసింగ్ రూమ్స్ ఏర్పాటు
5,700 టాయిలెట్స్ ఏర్పాటు చేయగా… 5,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు.
196 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయగా… 911 స్తంబాలు ఉంచారు.
5,192 మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు
Read Also: నల్లగొండ బీజేపీలో కుమ్ములాట
Follow Us On: Pinterest


