కలం, వెబ్ డెస్క్ : మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది. మెయిరాంగ్ ప్రాంతంలోని త్రోంగ్లావోబీ అవాంగ్ లైకాయ్ గ్రామంలో ఒక పౌరుడి ఇంటిపై మంగళవారం మిలిటెంట్ల రాకెట్లు వచ్చి పడగా.. ఆ సమయంలో నిద్రిస్తున్న తల్లి బినిత (37), వారి ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల పసికందు చనిపోయింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ యువతి సోషల్ మీడియాలో ప్రధాని మోదీ (PM Modi)కి విన్నపం చేశారు.
”మిలిటెంట్లు రాకెట్లతో దాడి చేసి, తల్లితో పాటు నిద్రిస్తున్న ఇద్దరు అమాయక పసికందులను హత్య చేసిన ఘటనపై మీరెందుకంత మౌనం వహిస్తున్నారు? మణిపూర్ భారతదేశంలో భాగం కాదా? మణిపూర్‌కు ఇప్పుడు న్యాయం జరగాలి. న్యాయం లేకపోతే శాంతి లేదు” అంటూ సదరు యువతి వాపోయింది. తమ ప్రాంతంలో శాంతిని ప్రసాదించండి అంటూ సదరు యువతి ప్రధాని మోదీకి విన్నపం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

