కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project)లో నీటి నిల్వలపై అధికారులు ముందస్తు వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సాధారణంగా వానాకాలం ప్రారంభంలో ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో గేట్లు ఎత్తుతుంటారు. అయితే ఈసారి వర్షాలు ఆశించినంతగా లేకపోవడంతో భవిష్యత్తు సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు 25 గేట్లను మంగళవారం పూర్తిగా మూసివేశారు.
తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project) పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 69.43 మీటర్లుగా ఉంది. గేట్ల క్రస్ట్ లెవెల్ 69 మీటర్లు కావడంతో ప్రస్తుతం వస్తున్న వరద నీటిని నిల్వ చేసేందుకు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం జలాశయానికి 1,208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తెలంగాణ–ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో విస్తరించిన క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు వేగంగా ప్రాజెక్టులోకి చేరుతుంది.
ఈ నీటిని నిల్వ చేయడం ద్వారా జలాశయాన్ని త్వరగా నింపాలని అధికారులు భావిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నీటి నిల్వలు పెరిగిన వెంటనే ఎడమ, కుడి ప్రధాన కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ ముందస్తు నీటి నిర్వహణ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

