కలం, వెబ్ డెస్క్: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత విధానాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. కొత్తగా జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ అంశాలపై సమీక్ష జరిగినట్లు వెల్లడించారు.
అలాగే గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలు, బూత్ లెవల్ కమిటీల నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించినట్లు పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే మంత్రులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిస్తున్నారు. ఇక టికెట్ల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి, కార్పొరేషన్ మేయర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. దీంతో టికెట్లు దక్కని నేతలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలతో సమన్వయం చేసుకొని టికెట్లు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Read Also: ఉపాధి హామీ నిరసనల్లో మీనాక్షి.. ఎల్లుండి మెదక్‌లో శ్రీకారం
Follow Us On : WhatsApp


