కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ (NEET -UG) ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో శనివారం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు (CS), ప్రధానోపాధ్యాయులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో ఉన్న12 నీట్ పరీక్షా కేంద్రాలలో అధికారులు పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లును పూర్తి చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో సి.సి టీవీ కెమెరాలు, జ్యామర్లు, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలను ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పని చేస్తున్నాయా లేవా నిర్ధారించుకోవాలని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల తనిఖీ (ఫ్రిస్కింగ్) కోసం అవసరమైన బ్యాక్ అప్ ఏర్పాట్లును కూడా చేసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, తరగతి గదుల్లో అభ్యర్థులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, టేబుల్లు ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే ఫ్యాన్లు, లైట్లు సరిగా ఉన్నాయా లేవా ముందే చూసుకోవాలని సూచించారు.
పరీక్షలను పారదర్శకంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో సరిపడ సి.సి టీవీ కెమెరాలు, జ్యామర్లు ఉన్నాయా, బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థ విషయాన్ని ఆమె చీఫ్ సూపరింటెండెంట్లను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని అన్నారు.
ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ ను అన్ని కేంద్రాల్లో ఉదయం 9.30 గంటలలోపు సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు పరీక్ష కేంద్రాలలో మెడికల్ క్యాంపు లో ఏర్పాటు చేసి కావలసిన మందులను, వేసవి దృష్ట్యా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆర్.టీ.సి అధికారులు ఉదయం 9 గంటల నుండి అధిక సంఖ్యలో బస్సులను నడిపేటట్టు చూడాలని తెలిపారు. పోలీసు శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, ప్రవేశం లేని వ్యక్తులను లోపలికి అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు మొత్తం 4,214 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 25 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉండగా, వారికి అదనంగా ఒక గంట సమయం ఇచ్చి సాయంత్రం 6.00 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 372 మంది ఇన్విజిలేటర్లును, 13 మంది పరిశీలకులు నియమించినట్టు తెలిపారు. అదనంగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి స్వతంత్ర పరిశీలకులు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేయబడతాయి. పరీక్ష మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఆభరణాలు, పౌచులు, పెన్సిల్లు, పెన్నులు, అనుమతి లేని ఎటువంటి వస్తువులను తీసుకురావద్దని సూచించారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోనే పెన్నులు అందజేస్తారు అని అన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ, ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.ఎల్.బి. హరిప్రియా, డి.ఆర్.ఓ. రాం రెడ్డి, జిల్లా నీట్ నోడల్ అధికారి వై. సురేందర్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు , ఇతర అధికారులు పాల్గొన్నారు.

