కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా పాలేరు (Paleru) నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన, జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ మంత్రులే టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఆదాయం కుంటుపడినా, మంత్రుల సొంత సంపాదన మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోందని మండిపడ్డారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రెవెన్యూ రోజురోజుకూ పడిపోతుంటే, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆదాయం మాత్రం అడ్డగోలుగా పెరుగుతోందని కేటీఆర్ (KTR) ఆరోపించారు. రాష్ట్రాన్ని నిలువునా లూటీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) పేరును ‘పొంగులూటి’ గా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దానికి భిన్నంగా వ్యవసాయ మంత్రికి సంబంధించిన అక్రమాలు మాత్రం రోజుకొకటి చొప్పున బయటపడుతున్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్న తరుణంలో, ఇటు ఆర్థిక మంత్రి కమిషన్ల దందాను జోరుగా సాగిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎటు చూసినా అరాచక పాలన నడుస్తోందని, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు.
Read Also: రేవంత్ వార్నింగ్.. ఆఫీసర్లు డోంట్ కేర్!
Follow Us On : WhatsApp

