కలం, తెలంగాణ బ్యూరో: ‘‘అధికారులు కార్యాలయాలకే పరిమితం కావొద్దు.. ఫీల్డులో తిరగాలి.. ప్రజల మధ్యే ఉండాలి.. వారి సమస్యలను తెలుసుకోవాలి.. పరిష్కారానికి చొరవ తీసుకోవాలి.. ప్రభుత్వ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించాలి.. ఏసీ గదులు వదలాలి..’’ ఇవన్నీ బ్యూరోక్రాట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరచూ చెప్పే మాటలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వీటిని పదేపదే చెప్తున్నారు. కలెక్టర్ల సమావేశాలు, సమీక్షా సమావేశాలు, జిల్లా పర్యటనలు, ప్రజాప్రతినిధులతో జరిగే సమావేశాలు.. ఇలా అనేక వేదికలపై ఇదే సందేశాన్ని వినిపిస్తున్నారు.
కానీ.. ఆ సూచనలు, హెచ్చరికలు, ఆదేశాలేవీ క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. రెండేండ్లుగా చెప్తున్నా డోన్ట్ కేర్.. లైట్ తీస్కో ధోరణిలో చాలా మంది పెద్దాఫీసర్లు ఉంటున్నారు. అసలే ఐఏఎస్ అధికారుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్ర సర్కారు.. చర్యలు తీసుకోడానికి తటపటాయిస్తున్నదనే భావన ఉంది. మహా అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది తప్ప ఇంకేం చేయగలదనే ధీమాతోనే కొందరు బ్యూరోక్రాట్లు (Bureaucrats) సీఎం వార్నింగ్ ను కూడా లెక్క చేయడం లేదన్న వాదన వినిపిస్తున్నది.
“వర్షాల సన్నద్ధతపై జూన్ 1న నేను సమీక్ష నిర్వహించి స్వయంగా అనేక సూచనలు చేశాను. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. జూన్ 9న వర్షం సమయంలో మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లేదు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆయన ఆదేశించారు. అఖిల భారత సర్వీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే చర్చ ఎలాగూ ఉన్నది.
నిర్లక్ష్యంగా ఉంటే సహించే ప్రసక్తే లేదంటూ సీఎం చేస్తున్న హెచ్చరికలు మాటలకే పరిమితమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ఆఫీసర్లు స్వయంగా అక్కడికి వెళ్లాలని సీఎం సూచించారు. కానీ, ఆర్డీవో స్థాయి అధికారుల సందర్శనలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇక విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి హాస్టళ్లలో నిద్ర చేయాలన్న సూచన, ఆదేశం సైతం మాటల దగ్గరే ఆగిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా బ్యూరోక్రాట్ల ఆచరణ ఎక్కడి గొంగళి.. అక్కడే.. అన్నట్లుగా తయారైంది.
రెండున్నరేండ్లలో భారీ బదిలీలు
ఇది ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ సమస్యల పరిష్కారం, విద్యార్థి హాస్టళ్ల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సమస్యలు, వర్షాకాల అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయకపోవడం ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నది. ఫీల్డ్ విజిట్లు చేయాలని సీఎం చెప్పినా సీనియర్ అధికారులు జిల్లా కేంద్రాలు, కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో ఆశించిన తీరులో పనిచేయని ఆఫీసర్లపై బదిలీ వేటు పడుతున్నది. రెండున్నరేండ్ల కాలంలో నాలుగైదు సార్లు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల భారీ స్థాయి బదిలీలు జరిగాయి. నలుగురు జీహెచ్ఎంసీ కమిషనర్లు మారారు. కొన్ని కీలక శాఖలకు ఇప్పటికీ పూర్తిస్థాయి సెక్రటరీలు లేరు. అదనపు బాధ్యతలు తప్పడంలేదు. ఐఏఎస్ అధికారుల కొరత కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బదిలీలు చేసినా పెద్దగా ఆఫీసర్లలో మార్పు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఫస్ట్ కాన్ఫరెన్సులో సున్నితంగా వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2023 డిసెంబర్ 24న జరిగిన కలెక్టర్, ఎస్పీల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. పాత పద్ధతులను విడిచిపెట్టాలని, ప్రజా ప్రభుత్వ అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పనితీరును మార్చుకోవాలన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2024 జులై 25న కలెక్టర్లతో సచివాలయంలో తొమ్మిది గంటల పాటు సుదీర్ఘ సమావేశాన్ని సీఎం నిర్వహించి.. ఏసీ రూములకే పరిమితం కావొద్దని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఎస్ఆర్ శంకరన్, శ్రీధరన్ లాంటి ఆఫీసర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయడానికి కలెక్టర్‌గా బాధ్యతలు ఒక మంచి అవకాశామని, కెరీర్‌లో ఈ అనుభవాలు ఎప్పటికీ నిలిచిపోయేవన్నారు. కానీ రెండేండ్ల తర్వాత కూడా బ్యూరోక్రాట్ల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది. హెచ్చరించక తప్పలేదు.
హాస్టళ్లలో నిద్ర.. కొందరికే పరిమితం
ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లను సందర్శించడంతో పాటు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి నెలకు కనీసం ఒకటి, రెండుసార్లు అక్కడ రాత్రిపూట విద్యార్థులతో నిద్ర చేయాలని సీఎం సూచించారు. ఒకరిద్దరు కలెక్టర్లకు మాత్రమే అది పరిమితమైంది. ప్రజావాణి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. పద్ధతి మార్చుకోకుంటే బదిలీ తప్పదని హెచ్చరించారు. అధికారుల పనితీరును ట్రాక్ చేస్తున్నామని, ప్రతీ నెలా చీఫ్ సెక్రటరీకి నివేదిక పంపాలని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి స్వయంగా తానే రివ్యూ చేస్తానని సీఎం వివరించారు.
వైఖరి మార్చుకోకపోతే లూప్ లైన్ పోస్టులకు బదిలీ చేస్తామని గట్టిగానే హెచ్చరించారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా 2024 నవంబరు 19న జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలోనూ ఇవే అంశాలతో సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని, ఫీల్డ్ లెవల్‌లో మానిటరింగ్ లోపించిందని, అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. సచివాలయంలో 2025 జనవరి 5న జరిగిన రివ్యూ మీటింగులో బ్యూరోక్రాట్ల పనితీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ చూపించని అధికారులపై కఠినంగా ఉంటామని, త్వరలోనే పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటికీ అదే నిర్లక్ష్యం
బ్యూరోక్రాట్లు ఇక మారరు.. అనే సాధారణ అభిప్రాయం ప్రజల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్నది. రెండున్నరేండ్లుగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా.. చాలా మంది బ్యూరోక్రాట్లలో మార్పు లేదు. కొద్దిమంది రూల్స్ ప్రకారమే పనిచేస్తామనే సాకులు చూపుతుండగా మరికొందరు ‘లైట్ తీస్కో’ తరహాలో వ్యవహరిస్తున్నారు. వర్షం సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం.. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.
అవసరమైతే తాను సైతం రోడ్డుపైకి వస్తానన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్యలొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవ తప్పిదాలతో సమస్యలు వస్తే సహించనని వార్నింగ్ ఇచ్చారు. రెండున్నరేండ్లుగా ఇలాంటి వార్నింగ్‌లకు అలవాటుపడిన అధికారులు ‘మేమింతే..’ అనే ధోరణిలోనే ఉన్నారనే విమర్శలకు సీఎం తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది.రాష్ట్రంలో ప్రభుత్వం ఆశిస్తున్న పరిపాలన, బ్యూరోక్రసీ అనుసరిస్తున్న పనివిధానానికి మధ్య అంతరం ఏర్పడింది.
ప్రజల వద్దకు వెళ్లే పాలనగా మారాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఫైళ్లు, సమావేశాలు, కార్యాలయాలకే పరిమితం కావాలన్నది మెజారిటీ బ్యూరోక్రాట్ల భావన. ఇప్పటికే సగం పీరియడ్ ముగిసినందున రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి హెచ్చరికలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయా?.. కఠిన చర్యలుగా మారతాయా?.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహనానికి మరో రూపాన్ని చూడాల్సి వస్తుందా?.. అధికార యంత్రాంగం తన పని తీరును మార్చుకుంటుందా?.. ఇప్పుడు ఇదీ సచివాలయ వర్గాల్లో ప్రధాన చర్చ.

