కలం, ఖమ్మం బ్యూరో: “ధైర్యంగా ఉండు తమ్మీ.. వైద్యానికి ఎంత ఖర్చయినా మేం చూసుకుంటాం. త్వరలోనే స్వయంగా మీ ఇంటికి వస్తా” అంటూ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్‌కు (Ramachandra Rao Banjar) చెందిన యువకుడు బన్నె మణికంఠ యాదవ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. మణికంఠ చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో భారీగా ఖర్చు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రస్తుతం మణికంఠను ఇంటి వద్దే ఉంచి కుటుంబ సభ్యులు సంరక్షిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మణికంఠ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మణికంఠ పరిస్థితిని కేటీఆర్‌కు ఫోన్ ద్వారా వివరించారు.
వీడియోకాల్‌లో పరామర్శ
సండ్ర వెంకట వీరయ్య ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్.. మణికంఠతో వీడియోకాల్‌లో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణికంఠకు ధైర్యం చెబుతూ.. చికిత్సకు ఎంత ఖర్చయినా పార్టీ తరఫున తామే చూసుకుంటామని, ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. కేటీఆర్‌ను స్వయంగా కలవాలనే తన కోరికను మణికంఠ వీడియోకాల్‌లో వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. త్వరలోనే మణికంఠ ఇంటికి స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పిన కేటీఆర్, సండ్ర వెంకట వీరయ్యలకు మణికంఠ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

