కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది యాసిర్ (Terrorist Yaseer) హతమయ్యాడు. బుద్గాం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులున్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, జమ్మూ స్పెషల్ పోలీసులు ‘ఆపరేషన్ అష్దార్’ పేరిట సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించడంతో జవాన్లు ధీటుగా స్పందించారు. ఈ క్రమంలో ఒక ఉగ్రవాది మరణించగా.. అతడిని యాసిర్‌గా గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు కూడా ఉన్నారనే నిఘా సమాచారంతో భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్మీ ఉన్నతాధికారులు ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అయిదు ఉగ్ర దాడుల్లో యాసిర్..
పాకిస్థాన్‌కు చెందిన యాసిర్ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో కీలక సభ్యుడు. పూంచ్, బారాముల్లా సహా అయిదు దాడుల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ దాడుల్లో 23 మంది భద్రతా సిబ్బంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. 2024లో పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాహనంపై దాడి, గుల్మార్గ్ వద్ద ఆర్మీ జవాన్ల వాహనంపై దాడి చేశాడు. అప్పటి నుంచి యాసిర్ లక్ష్యంగా భద్రతా బలగాల వేట కొనసాగుతుండగా.. ఎట్టకేలకు హతమయ్యాడు. అంతేగాకుండా పహల్గాం ఉగ్ర దాడికి స్కెచ్ వేసిన సులేమాన్‌కు యాసిర్ ప్రధాన అనుచరుడిగా గుర్తించారు.

