నాడు నై.. నేడు సై.. డీలిమిటేషన్‌పై కేటీఆర్ ‘యూ టర్న్’

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల చేసిన వ్యాఖ్యలు గతంలో ఆయన ప్రదర్శించిన వైఖరికి భిన్నం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాల మొదలు తాజాగా నియోజకవర్గాల డీలిమిలిటేషన్ వరకు అనేక గతంలోని వ్యాఖ్యలకు ‘యూ టర్న్’ తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం డీలిమిటేషన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో డీలిమిటేషన్ ప్రస్తుత విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కామెంట్ చేశారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రస్తుతం 50% ప్రోరేటా విధానంలో లోక్‌సభ, శాసనసభ స్థానాలను పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని మంచిర్యాలలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగానూ, ఆ తర్వాత ట్విట్టర్ వేదికగానూ వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే ‘యూ టర్న్’ తీసుకోవడం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చకు దారితీసింది. గతేడాది కుదరదంటూనే ఈసారి ఓకే.. అని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది.

డీలిమిటేషన్‌పై గతేడాది కేటీఆర్ వైఖరేంటి :

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ, దానికి అనుసరించే విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయంగా ఉన్నాయని, వివిధ రాష్ట్రాల, పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే నిమిత్తం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జేఏసీ పేరుతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధిగా ఆ సమావేశానికి హాజరైన కేటీఆర్ స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. “జనాభా నియంత్రణ పాలసీని సమర్ధవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం విధిస్తున్న శిక్షా?.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే జనాభాను నియంత్రించాయి.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.. కానీ డీలిమిటేషన్‌కు జనాభాను ప్రాతిపదికగా తీసుకుని డీలిమిటేషన్ చేపట్టడం దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడమే.. ఇది సరైన విధానం కాదు..” అని కేటీఆర్ అన్నారు.

పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఉండొద్దా? :

కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ ప్రాతిపదికను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ “జీడీపీ ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలి.. భారతదేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 36%గా ఉన్నది… పార్లమెంటులోనూ అంతే నిష్పత్తిలో 36% ప్రాతినిధ్యం ఎందుకు ఉండకూడదు?..” అని ప్రశ్నించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతానికి పెంచకుండా, మెరుగైన పాలన కోసం రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెంచాలని సూచించారు. ఈ ప్రకారం ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం అనుసరించే డీలిమిటేషన్ విధానం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఇప్పుడు గళం విప్పకపోతే, రాబోయే తరాలు మనల్ని క్షమించవని హెచ్చరించారు.

“ఈ పోరాటం కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక పార్టీకో సంబంధించింది కాదు.. మొత్తం భారత సమాఖ్య వ్యవస్థ మనుగడకు సంబంధించినది.. దక్షిణాది రాష్ట్రాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. కేవలం జనాభా ప్రాతిపదికనే కాకుండా ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, అక్షరాస్యత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల విభజన జరగాలి” అని డిమాండ్ చేశారు.

డీలిమిటేషన్‌పై తాజాగా ఏమన్నారు? :

“కేంద్ర ప్రభుత్వం ప్రో-రేటా పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% చొప్పున సీట్ల సంఖ్యను పెంచినప్పుడు, దానిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది?.. ఈ పద్ధతిలో సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతేమీ తగ్గదు.. దీనిని ఆహ్వానించవచ్చు.. సీట్లు పెరగడం వల్ల కొత్త తరం నాయకులకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం దక్కుతుంది.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే… కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నదో చెప్పాలి.. సీట్లు పెరిగితే కొత్త నాయకులు రావాల్సి ఉంటుందని, పట్టు కోల్పోతామని భయపడుతోందా?.. ఒకవైపు ఫెడరలిజం గురించి మాట్లాడుతూనే, మరోవైపు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పెరగకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది” అని కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇంతకాలం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది.. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలి.. అంటూ కామెంట్ చేసిన కేటీఆర్ ఇప్పుడు హటాత్తుగా యూ టర్న్ తీసుకోవడం బీఆర్ఎస్‌లోనే చర్చకు దారితీసింది.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow US On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>