కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. సిట్ అనేది ఉత్తదే అని.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టే ఉందన్నారు. ‘అది సిట్ కాదు.. తెలుగులో కార్తీక దీపం సీరియల్ వస్తది అది ఒడవదు. ఈ సిట్ కూడా అంతే. 420 హామీలిచ్చి అమలు చేయట్లేదు. వాటి నుంచి ప్రశ్నిస్తుంటే తప్పించుకోడానికి రోజుకో డ్రామా ఆడుతున్నారు. మొన్నటి దాకా కాళేశ్వరంలో స్కామ్, గొర్రెల పంపిణీలో స్కామ్, ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేసులో స్కామ్ అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ పబ్బం గడుపుతున్నారు’ అంటూ కేటీఆర్ తెలిపారు.
అసలు సిట్ వేయాల్సింది బీఆర్ ఎస్ నేతల మీద కాదని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) కొడుకు భూములు కబ్జా చేస్తున్నారని ఆయన మీద వేయాలన్నారు. ‘సింగరేణిలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, బీజేపీ నేతలు కుంభకోణాలు చేస్తున్నారు. దాని మీద సిట్ వేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న స్కాముల మీద ఫిర్యాదు చేస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు ఆదేశిస్తారంట. ఇదే విడ్డూరం. కాంగ్రెస్ నేతలు చేస్తున్న కుంభకోణాల గురించి ప్రభుత్వం ఫిర్యాదు చేస్తుందా అసలు. అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డికి అర్హత లేకపోయినా కాంట్రాక్టులు దక్కించుకున్నారు. వీటిపై ఆధారాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నేను అప్పగించాను. దాని మీద సిట్ వేయండి. కంచెగచ్చిబౌలి భూముల్లో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగింది.
దీన్ని సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. సీఎం రేవంత్ అవినీతి చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు గానీ.. ఎలాంటి విచారణలు చేయట్లేదు’ అంటూ ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR).
Read Also: మరోసారి ఫామ్‌హౌస్‌కు హరీష్ రావు; కేసీఆర్‌తో కీలక భేటీ
Follow Us On: X(Twitter)


