Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్​ఎస్​ నేతల అరెస్టులు.. కేటీఆర్​ రియాక్షన్​ ఇదే!

కలం, వెబ్​ డెస్క్​ : తమ భూములను కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్‌లను గృహనిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. పోలీసు బలంతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు.

పరిగి (Parigi) నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా 1200 ఎకరాల భూమిని సేకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, పేదల భూములపై పడిందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూములు దోచుకోవాలని చూడటం దుర్మార్గమని కేటీఆర్​ (KTR) పేర్కొన్నారు.

గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని సర్కార్, భూములను లాక్కోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లను పంచుకుంటూ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, ఉద్యమ కాలం నుండే ఇలాంటి అణచివేతలను ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడరని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: కేరళం ఎన్నికలు.. విజయన్‌కు కవిత మద్దతు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>