కలం, వెబ్ డెస్క్: ‘నేను పుట్టిన మట్టి సాక్షిగా చెప్తున్నా అక్రమ, అనైతిక పనులు ఏనాడూ చేయలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పలు హోదాల్లో పని చేసే అవకాశం వచ్చిందని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేయడం తప్ప ఏనాడూ తప్పులు చేయలేదని కేటీఆర్ అన్నారు. నిబద్ధతతో పదేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేసి తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దామన్నారు.
గత పదేళ్లలో ఏనాడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం, ప్రత్యర్థుల పిల్లలపై బురద జల్లేలా ప్రచారం చేయడం, ప్రతి పక్షాలపై కక్షసాధింపు చర్యలు చేయడం ఏనాడూ జరగలేదన్నారు. కేసీఆర్ కష్టపడి సాధించిన తెలంగాణలో నేడు పిచ్చోడి చేతిలో రాయిలా పాలన మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కొన్ని రోజులు గొర్రెల స్కాం అని, కాళేశ్వరం అని, ఫార్ములా ఈ అని, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లలో తన మీద తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని క్షోభకు గురి చేశారన్నారు. అయినా ఏనాడూ బాధ పడలేదని, బయటకు వచ్చి వేరే వాళ్ల లాగా దొంగ ఏడుపులు ఏడవలేదని చెప్పారు. నిబద్ధతతో ఉన్న నాయకుడిగా ధైర్యంగా అన్నీ ఎదుర్కొన్నానన్నారు.విచారణకు ధైర్యంగా వెళ్లి తమ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని నిలదీస్తానని కేటీఆర్ వెల్లడించారు.
గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) పేరుతో డైలీ సీరియల్ మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తనకు హీరోయిన్లతో సంబంధాలు పెడుతూ, డ్రగ్స్ తీసుకుంటానంటూ ప్రచారం చేస్తూ, ఏళ్ల తరబడి లీకుల రూపంలో తన వ్యక్తిత్వ హననం జరుగుతునన్న దానికి బాధ్యులు ఎవరు అని సిట్ విచారణలో ప్రశ్నిస్తానని చెప్పారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ లీకులు ఇచ్చి, వార్తలు రాయించి పోలీసులతో డ్రామా చేయిస్తున్నారని మండిపడ్డారు.
మరి కొన్ని రోజులకు ఏం జరగలేదని కూడా వీళ్లే అంటారని చెప్పారు. తన పరువుకు బాధ్యులు ఎవరని, మీడియా, ప్రభుత్వం, పోలీసులలో ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ నిలదీశారు. తనను వేధిస్తున్న ప్రభుత్వాన్ని, కొందరు అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టను అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదు అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రోజు కెమెరా ముందుకు వచ్చి దీనిపై డీజీపీ శశిధర్, సీపీ సజ్జనార్, ఐజీ ఇంటెలీజెన్స్ వెరైనా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గూఢచారి వ్యవస్థలు పని చేస్తుంటాయన్నారు. ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేలా చేస్తే దాన్ని నిరోధించడానికి నిఘా వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మంత్రులతో పాటు అందరి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మహిళా నేతలు కేటీఆర్‌కు తిలకం దిద్ది విచారణకు సాగనంపారు.
Read Also: కవిత భుజంపై కాంగ్రెస్ తుపాకీ
Follow Us On: X(Twitter)


