జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)లో ఓటమితో చిన్న ఝలక్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మెడలు వంచడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ భవనంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని కేటీఆర్ గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని, ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీసేశామని తెలిపారు.
“ఏదైనా అడిగితే ఫ్రీ బస్సు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు.. మగవాళ్లకు డబుల్ రేటు పెట్టారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ప్రజలు హామీ గురించి ప్రశ్నించాలి” అని కేటీఆర్ కోరారు. ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు, రైతులకు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని ఆయన లెక్కలు చెప్పారు. ‘‘కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే చిన్న షాక్ ఇవ్వాల్సిందే.. లేదంటే వాళ్లు దారికి రారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం ఏం చేయకపోయినా.. మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారు. ఇన్ని రకాలుగా మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేస్తున్నారంటే మేమే కరెక్ట్ అని వాళ్లు అనుకుంటారు’’ అని కేటీఆర్(KTR) హెచ్చరించారు.
Read Also: ఓవైసీ బ్రదర్స్ దొంగ మైనారిటీలు: ఆర్ఎస్‌పీ

