కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ప్రకటన చేశారు. త్వరలో తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. మంచిర్యాలలో ఆదివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, 2027లో పాదయాత్ర చేసి వాటన్నింటిపై పోరాడతామన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపై స్పందిస్తూ తమ పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించారు. ఏపీలోని టీడీపీలో కొన్ని మంచి లక్షణాలున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత నేరుగా కార్యకర్తలతో మాట్లాడతారని, కానీ తమ పార్టీలో ఆ పద్ధతి లేదని చెప్పారు. తమ నాయకుడు ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. దీంతో కార్యకర్తలకు, పార్టీ అధినేతకు మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం నియోజకవర్గాల్లో సమస్యలను అంచనా వేసి పరిష్కరించలేకపోయామని చెప్పారు. కార్యకర్తలకు, నాయకుడికి మధ్య గ్యాప్‌ను నివారించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇక జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త పార్టీపై కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వస్తే అంత మంచిదని కేటీఆర్ (KTR) అన్నారు. అయితే ఆ పార్టీలకు ప్రజలు ఓట్లు వేయాలి కదా అని వ్యాఖ్యానించారు. మన బాధే జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మరని, తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు కానీ ఏడిపించవద్దని కామెంట్ చేశారు. ఇక తమకు ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు పొత్తులు కలిసి రావని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ సింగిల్‌గానే బరిలో నిలుస్తుందని వెల్లడించారు.
Read Also: రోగుల వార్డుల్లో రీల్స్ గోల.. మెడికోలపై విమర్శలు
Follow Us On : WhatsApp

