తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ(Vote Chori)కి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటైన విమర్శలు చేశారు. ఈ అంశంపై తాము కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని, ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా అధికారి నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయిందని, వెంటనే దీని మీద విచారణ చేపట్టి, ఈ దొంగ ఓట్లను తొలగించి, అధికారులను శిక్షించండి అని చెప్పామని వెల్లడించారు కేటీఆర్. అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల అధికారులు బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉంటే వారితో కుమ్మక్కయి పనిచేస్తున్నారని ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ అభ్యర్థి సొంత సోదరుడికే 3 దొంగ ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక. మేము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము.. మాకు ఎన్నికల కమిషన్(Election Commission) మీద నమ్మకంలేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే సంస్థ. మరి ఇంక గత్యంతరం లేదంటే కోర్టుకు వెళ్లి అక్కడ పోరాటం చేస్తాము. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాము.. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ స్పందించాలి. ఎన్నికలు 10 రోజులు ఆలస్యమైనా సరే దొంగ ఓట్లు తొలగించి న్యాయంగా ఎన్నికలు జరిపించండి. దీనికి కారణమైన అధికారి మీద చర్యలు తీసుకోండి. ఓటర్ల అనుమతి లేకుండా వివిధ జిల్లాల నుండి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. గోగూరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి సిరిసిల్ల(Sircilla)లో ఓటు ఉంది, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓటు వచ్చింది. దీనిపై శ్రీనివాస్ రెడ్డిని కలిస్తే నా ఓటు జూబ్లీహిల్స్(Jubilee Hills) లో ఎలా వచ్చిందని షాక్ అయ్యా, నేను పుట్టింది, పెరిగింది ఇప్పుడు ఉండేది అంతా సిరిసిల్లలోనే అని అన్నాడు’’ అని కేటీఆర్(KTR) తెలిపారు.

