కలం, వెబ్ డెస్క్ : వరంగల్ మామునూరు విమానాశ్రయ (Mamunur Airport) పునరుద్ధరణకు కీలక అడుగు పడింది. 1930లో నిజాం కాలంలో నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరుకు పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర విమానయాన శాఖకు అప్పగించింది.
హైదరాబాద్ బేగంపేటలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ఇతర ప్రజాప్రతినిధులు గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే 300 కోట్ల రూపాయల నిధులను కేటాయించి భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
2007లో ఒప్పందం జరిగినప్పటికీ ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తెలంగాణలో మొత్తం 3 విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి మామునూరు విమానాశ్రయం (Mamunur Airport) ఒక కీలక మలుపు కానుందని తెలిపారు.


