కలం, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2026) అభ్యర్థులకు గుడ్ న్యూస్. గూగుల్ ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమిని’లో ఫ్రీగా మాక్ టెస్ట్‌లు రాయొచ్చు. ఈ మేరకు గూగుల్ వెల్లడించింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా జేఈఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ అత్యంత కఠినంగా ఉంటాయి. ఉచితంగా మాక్ టెస్ట్‌లు రాసుకునే అవకాశం వల్ల అభ్యర్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
‘కెరీర్ 360’, ‘ఫిజిక్స్‌వాలా’తో కలసి గూగుల్ ఈ సౌకర్యం తీసుకొచ్చింది. ఉచితంగా మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలనే అంశంపై తయారుచేసిన ఏఐ వీడియోను గూగుల్ ల్యాబ్స్ డైరెక్టర్ జోష్ ఉడ్వర్డ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. జేఈఈ (JEE Main 2026) పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయిలో మాక్ టెస్ట్‌లు ఉచితంగా అందించాలంటూ భారత విద్యార్థులు కోరడంతో ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఉచితంగా జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్‌లు రాసే అవకాశం కల్పించడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్‌కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
గత వారం అమెరికాలో శాట్ (SAT) పరీక్షలకు, ఇప్పుడు జేఈఈ మెయిన్ అభ్యర్థులకు గూగుల్ ఉచితంగా మాక్ టెస్ట్‌లు రాసే అవకాశం కల్పించడంపై ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి రోజులను గుర్తుకు చేసుకున్నారు. అప్పట్లో ఇలాంటి సౌకర్యం తమకు కూడా ఉండి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. కాగా, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ చదివిన సంగతి తెలిసిందే.


