కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకొని పట్టుబడటంతో ప్రకంపనలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంలో కార్నర్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నేత పట్టుబడటం ఆ పార్టీని ట్రబుల్స్ లో పడేసింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) డ్రగ్స్ అంశంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. డ్రగ్స్ టెస్టులపై స్పందించారు. సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులతోపాటు సినీ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు కూడా 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. టెస్ట్ చేయించుకున్న తర్వాతే సినిమాలు విడుదల చేయాలన్న నిబంధన తీసుకురావాలన్నారు. టెస్ట్ చేయించుకోకపోతే సినిమాలు విడుదల ఆపేయాలన్నారు. పొలిటీషియన్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతాయని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వొద్దని కోరారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని.. అప్పటి ప్రభుత్వం డ్రగ్స్ వాడకాన్ని చూసి చూడనట్టు వదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఇక నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్న నిబంధన ఆసక్తికరంగా మారింది. సినిమా స్టార్లు, ఆర్టిస్టులు, పొలిటికల్ లీడర్లకు డ్రగ్స్ టెస్టులు చేస్తే అందరి బండారం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి నిజంగా ప్రభుత్వం డ్రగ్స్ టెస్టులు చేస్తుందా? రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారా? అన్నది వేచి చూడాలి. డ్రగ్స్ టెస్టులు అన్న డిమాండ్ కాంగ్రెెస్ నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో అసలు కాంగ్రెస్ నేతలు ఎవరిని ఉద్దేశించి టెస్టులు అనే అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు? నిజంగా టెస్టులు నిర్వహిస్తే మరికొంతమంది నేతలు దొరికిపోయే అవకాశం ఉందా? అన్నది వేచి చూడాలి. అసలు నిజంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారా? అన్నది కూడా అనుమానమే.

