కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న ‘నేషనల్ జియోగ్రాఫిక్ 33’ (National Geographic 33) జాబితాలో బాలీవుడ్ నటులు ఆలియా భట్ (Alia Bhatt), ప్రియాంక చోప్రా (Priyanka Chopra) స్థానం దక్కించుకున్నారు. 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన ఈ జాబితాలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, సామాజిక అంశాల్లో విశేష కృషి చేస్తున్న 33 మందిని నేషనల్ జియోగ్రాఫిక్ గౌరవించింది. కేవలం నటనకే పరిమితం కాకుండా, తమ పలుకుబడితో సమాజంలో మార్పు తెస్తున్నందుకు వీరికి ఈ గుర్తింపు లభించింది.
ఆలియా భట్ తన ‘కో-ఎగ్జిస్ట్’ (Coexist) సంస్థ ద్వారా జంతు సంరక్షణ, పర్యావరణంపై అవగాహన కల్పిస్తుండగా, ఆమె ప్రారంభించిన ‘మై వార్డ్ రోబ్ ఈజ్ సూ వార్డ్ రోబ్’ అనే కార్యక్రమం ద్వారా పాత బట్టలను తిరిగి వినియోగించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్ స్థాపించిన ‘బియాండ్ టైప్ 1’ సంస్థ ద్వారా డయాబెటిస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ఈ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. వీరితో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

