కలం, వెబ్ డెస్క్ : క్యాలెండర్‌లు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తూ, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రామారావు మాట్లాడుతూ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావును (KCR) 2028లో మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే పార్టీ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల దాడులు ఉన్నప్పటికీ, తాత్కాలిక వైఫల్యాలతో నిరాశ చెందకుండా, దృష్టిని కేంద్రీకరించి ముందుకు సాగాలని కార్యకర్తలను కోరారు.
రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టాలు మళ్లీ తిరిగి వస్తున్నాయని చెప్పారు. ‘రైతులు చలిలో కూడా యూరియా కోసం రోజుల తరబడి క్యూలలో నిలబడుతున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమవుతూ, రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తోంది. ప్రజల జీవితాలు బీఆర్ఎస్ పాలనకు ముందు ఉన్నట్టుగానే మళ్లీ స్థబ్దతలో పడిపోయాయి’ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, బీఆర్ఎస్ పాలనలోని దశాబ్ద కాలం అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిందని కేటీఆర్ (KTR) అన్నారు.
రాజకీయ కుట్రలు, దాడులు ఉన్నప్పటికీ, ప్రజల మద్దతు ఉన్నంత వరకు బీఆర్ఎస్‌ను బలహీనపరచలేరని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తిని రామారావు ప్రశంసించారు. రైతులు, గిరిజనులు, పర్యావరణం, విద్యార్థుల సమస్యలపై నిరసనలు నడిపినందుకు అభినందించారు. గెలుపోటములు తాత్కాలికమే కానీ, ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతమని అన్నారు. 2026లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే, పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న బీఆర్ఎస్‌కు విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: నీ కాళ్లు మొక్కుతా వదిలేయండి సార్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
Follow Us On: Youtube


