కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ (Karimnagar Police) కమిషనరేట్ పరిధిలో పాఠశాల విద్యార్థుల రవాణా వాహనాల భద్రతపై పోలీస్ & రోడ్డు రవాణా శాఖ (RTA) అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల రవాణాలో నిమగ్నమైన వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, మోటారు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ తనిఖీలలో భాగంగా.. ఫిట్‌నెస్ లేని 17 స్కూల్ బస్సులు, 50 ఆటోలను సీజ్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Gaush Alam) తెలిపారు. అలాగే, సరైన పత్రాలు (రిజిస్ట్రేషన్, పర్మిట్, ఇన్సూరెన్స్) లేని 64 వాహనాలపై, యూనిఫాం ధరించని 13 మంది డ్రైవర్లపై, నంబర్ ప్లేట్ లేని వాహనం, ఓవర్‌లోడింగ్‌తో నడుపుతున్న 9 వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 87 వాహనాలపై ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు వివరించారు.
”ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యత. పాఠశాల వాహనాల డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదు. వాహనాలకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్, ఇతర పత్రాలు ఉండాలి. వేగ నియంత్రణ పాటిస్తూ, మొబైల్ ఫోన్ వినియోగం లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము” అని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.కవిత, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: జాహ్నవి మిస్సింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్!
Follow Us On: Instagram

