Mobile Popup Ad
Mobile Popup Ad

మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను సీఎం (Revanth Reddy) ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ, ల్యాబ్‌లు, డైనింగ్ హాల్, ప్లేగ్రౌండ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం విద్యార్థులు, స్కూల్ కమిటీ సభ్యులతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన తర్వాత ఆరుట్లలో (Arutla) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

ఆరుట్ల టీపీఎస్ ప్రత్యేకతలు

ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అందించాలనే లక్ష్యంతో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను (Telangana Public School) ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి ప్రత్యేక పర్యవేక్షణలో పాఠశాల నిర్మాణం చేపట్టారు.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించనున్నారు. విద్యతో పాటు క్రీడలు, ఆటపాటలకు కూడా సమాన ప్రాధాన్యత కల్పించారు. విద్యార్థులకు బస్సు సౌకర్యంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండి అందించనున్నారు.

ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల ప్రాంతాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రాథమిక విభాగంలో 750 మంది, హైస్కూల్‌లో 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యమైన మార్పులకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>