కలం, వెబ్ డెస్క్: స్వర్ణాంధ్ర అభివృద్ధిలో ఈ రోజు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబు విజన్‌కు సాక్ష్యమని అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ను శనివారం ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
భారత్ మాతాకీ జై అంటూ..
భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం ప్రారంభించిన మోడీ.. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో అభివాదం చేశారు. ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన భూమికి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రధాన ఆరాధ్య దైవాలైన సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం దాదాపు రూ.18 వేల కోట్లతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
సేవలు విస్తరిస్తున్నాం..
దేశంలో 2014 కంటే ముందు 74 ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే ఉండేవని.. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 166కి పెరిగిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు ఎయిర్ సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల అభివృద్ధి జరుగుతోందని ప్రధాని చెప్పారు. మూలపేట, రామాయపట్నంలోనూ కొత్త పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన పారిశ్రామిక కారిడార్లను కూడా అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
13,500 మందితో థింసా నృత్యం..
పీఎం గతిశక్తి పథకంతో రైల్, పోర్టు, ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతోందని ప్రధాని స్పష్టం చేశారు. 13,500 మంది గిరిజన మహిళల థింసా నృత్యం అద్భుతంగా ఉందని ప్రధాని కొనియాడారు. అభివృద్ధితోపాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. సాఫ్ట్‌వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతోందన్న పీఎం.. ప్రతిభ ఉన్న యువతకు అనేక అవకాశాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.

