Mobile Popup Ad
Mobile Popup Ad

జాహ్నవి మిస్సింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్!

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు (Jahnavi Missing Case)లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప తల వెంట్రుకలు గుర్తించిన ప్రాంతంలో మంగళవారం రెండు బొమ్మలు వేలాడుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. అయితే వాటిని అధికారులే ఏర్పాటు చేసినట్లు తేలింది. జాహ్నవి అదృశ్యం అయిన ప్రాంతంలో మాంసంతో కూడిన రెండు బొమ్మలను అమర్చి, కెమెరాలను అధికారులు పెట్టారు. ఏదైనా అడవి జంతువు అటువైపు సంచరిస్తూ బొమ్మపై దాడి చేస్తే కేసుకి ఉపయోగం అవుతుందని భావించిన అధికారులు ఈ తరహా ప్రయోగం చేశారు.

మరోవైపు జూన్ 6వ తేదీన తండ్రి వెనకాలే.. నాన్నా నేనూ వస్తానంటూ వెళ్లిన జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి ఆచూకీ 11 రోజులైన ఇంకా లభించలేదు. పోలీసులు పాప జాడ కోసం వారు నివాసం ఉంటున్న తోటంతా జల్లెడపట్టారు. ఈ కేసులో కీలకమైన జాహ్నవి వెంట వెళ్లి వచ్చిన పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు సవాల్ గా మారింది. జాహ్నవిని ఎవరైనా చూసినా, ఆచూకీ తెలిసినా సమాచారం ఇస్తే లక్షరూపాయలు బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినా ఇంతవరకు ఎలాంటి కాల్ రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , హోంమంత్రి అనిత పాప మిస్సింగ్ పై పోలీసుల ద్వారా అన్ని విషయాలను తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన NDRF, SDRF సిబ్బంది.. 5 ఎకరాల తోట, దాని చుట్టూ అడవిలో పాప జాడ కోసం వెతుకుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>