కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం టీమిండియా చాలా కష్టాల్లో ఉందనే చెప్పాలి. ఫామ్‌లో ఉన్నా కూడా అనూహ్యంగా ఓటములు వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అవుతోంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా రానుంది. ఈ క్రమంలో అసలు ప్రస్తుతం టీమిండియాకు ఎలాంటి ప్లేయర్ కావాలి? అన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) స్పందించాడు. ఇప్పుడు టీమిండియాకు కావాల్సింది సిక్సర్లు కొట్టే బ్యాటర్లు, గాల్లో పల్టీలు కొట్టి క్యాచ్‌లు పట్టే ఫీల్డర్లు కాదని అన్నారు. వికెట్లు పడగొడుతూ, ప్రత్యర్థి టీమ్‌కు ముచ్చెమటలు పట్టించే బౌలర్ కావాలని అన్నారు. అందుకోసం ఆయన వరుణ్ చక్రవర్తిని సూచించాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓటమి తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ హీరో వరుణ్ చక్రవర్తిని వన్డే జట్టులోకి తీసుకోవాలని కైఫ్ (Mohammad Kaif) తెలిపారు. కుల్దీప్ యాదవ్‌కు తోడుగా వికెట్లు తీసే మరో బౌలర్ అవసరమని చెప్పారు. వైట్ బాల్ క్రికెట్‌లో వరుణ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వరుణ్ పేరు తప్పకుండా ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డారు. భారత బౌలింగ్ బలహీనంగా ఉందని చెప్పారు. వికెట్లు తీసే బౌలర్‌ను తుది జట్టులో పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ వన్డేల్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో పది వికెట్లు సాధించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో కూడా అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని కైఫ్ గుర్తు చేశారు. 2027 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో మార్పులు తప్పవని కైఫ్ స్పష్టం చేశారు. టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ ఖరారయ్యారని తెలిపారు. ఆరో సరైన బ్యాట్స్‌మన్ అవసరమని అన్నారు. నితీష్ కుమార్ రెడ్డిని ఇంకా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా చూడలేమని చెప్పారు. హర్షిత్ రాణా ప్రధాన పాత్ర బౌలింగ్ మాత్రమేనని పేర్కొన్నారు.
ప్రపంచకప్ గెలవాలంటే ఆరు సరైన బ్యాట్స్‌మెన్ అవసరమని కైఫ్ తేల్చిచెప్పారు. ఇద్దరు పూర్తి స్థాయి ఆల్‌రౌండర్లు కూడా అవసరమని అన్నారు. ప్రసిద్ధ్ కృష్ణా ఎంపికపై సందేహాలు ఉన్నాయని.. అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశాలు రాకపోవడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు.


