కలం, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 1 నుండి చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాల (Chinese CCTV Cameras) విక్రయాలపై భారత ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ముఖ్యంగా హెక్విజన్ (Hikvision), దాహువా (Dahua), టీపీ లింక్ (TP Link) వంటి చైనీస్ బ్రాండ్లపై నిషేధం అమలు కానున్నది. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ఈ కెమెరాల ద్వారా డేటా చోరీ జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ధృవీకరణ నిబంధనలు:
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ నిబంధనల ప్రకారం.. ఇకపై ప్రతి కెమెరాకు ఎస్టీక్యూసీ ధృవీకరణ తప్పనిసరి.
డేటా భద్రత:
విదేశీ తయారీ కెమెరాల ద్వారా రిమోట్ యాక్సెస్ పొందే అవకాశం ఉందని, దీని వల్ల కీలక మౌలిక సదుపాయాల సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
పారదర్శకత:
తయారీదారులు తమ కెమెరాల్లో వాడే చిప్‌సెట్ ఏ దేశానికి చెందినదో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 507 కెమెరా మోడళ్లకు అనుమతులు మంజూరు చేసింది.
మార్కెట్‌పై ప్రభావం:
భారతదేశంలో సీసీటీవీ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్ల నుండి 7.5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. గతంలో చైనా కంపెనీలు ఈ మార్కెట్‌లో మూడవ వంతు వాటాను కలిగి ఉండగా, తాజా నిబంధనలతో వాటి పట్టు తగ్గనుంది. మరోవైపు, భారతీయ బ్రాండ్లు అయిన CP Plus, Qubo, Prama, Matrix, Sparsh వంటి కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను మార్చుకుని (తైవాన్ చిప్‌సెట్‌లు, స్థానిక సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా) మార్కెట్‌లో 80 శాతం పైగా వాటాను సొంతం చేసుకున్నాయి.
వినియోగదారులకు ఎదురయ్యే సవాళ్లు:
ఈ మార్పు వల్ల స్వల్ప కాలంలో సీసీటీవీ కెమెరాల ధరలు పెరగడం లేదా సరఫరాలో కొంత అంతరాయం కలగవచ్చు. అయితే, దీర్ఘకాలంలో ఇది దేశీయ తయారీ రంగానికి (Make in India) పెద్ద ఊతాన్ని ఇస్తుంది. భారతీయ కంపెనీలు ఇప్పుడు తైవాన్ వంటి దేశాల నుండి చిప్‌సెట్‌లను దిగుమతి చేసుకుంటూ, సొంతంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులకు మరింత సురక్షితమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
చైనా యాప్‌లు, టెలికాం పరికరాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన భారత్, ఇప్పుడు నిఘా వ్యవస్థల విషయంలో కూడా ‘ట్రస్టెడ్ వెండర్’ విధానాన్ని పటిష్టం చేస్తోంది. భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి గతంలో టిక్‌టాక్, హువావే వంటి చైనీస్ యాప్‌లు, టెలీకాం పరికరాలపై ఆంక్షలు విధించింది. వ్యూహాత్మక ప్రాంతాలలో చైనా సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకోవడమే ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

