కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) లో లాహోర్ ఖలందర్స్ జట్టు చుట్టూ వివాదం చెలరేగింది. జట్టు కెప్టెన్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), ఆటగాడు సికిందర్ రజా (Sikandar Raza) భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని పంజాబ్ పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్.. పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ (Salman Naseer) కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. శనివారం రాత్రి టీమ్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సికిందర్ రజాకు పరిచయం ఉన్న నలుగురు వ్యక్తులు హోటల్‌లోకి రావడానికి అనుమతి కోరగా, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు తిరస్కరించారు. అనంతరం సమీన్ రాణా ద్వారా పాకిస్థాన్ సూపర్ లీగ్ సీఈఓని సంప్రదించినా అనుమతి లభించలేదు.
అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా అఫ్రిది, రజా స్వయంగా ఆ నలుగురిని తమ గదిలోకి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. వారు దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నట్లు సమాచారం. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ ఆటగాళ్లు వినిపించుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన టోర్నమెంట్ భద్రతకు, ఆటగాళ్ల రక్షణకు ముప్పు కలిగించే చర్యగా పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మరియు PSL యాజమాన్యాన్ని కోరారు.
ఇక ఈ వివాదంపై లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars) మీడియా హెడ్ ఉమర్ ఫరూక్ స్పందిస్తూ, తమ ఆటగాళ్లకు సంబంధించిన విషయంపై PSL నిర్వాహకులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాకిస్థాన్‌లో క్రికెట్ టోర్నీలు కఠిన భద్రత మధ్య జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనల అమలులో క్రమశిక్షణ ఎంతో కీలకమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

