భగీరథ్ కేసు.. ఇంటెరిమ్ ప్రొటెక్షన్ పై సస్పెన్స్ కంటిన్యూ!

కలం, తెలంగాణ బ్యూరో : పోక్సో కేసులో చిక్కుకున్న బండి భగీరథ్‌ (Bandi Bhagirath)కు ఇంటెరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తాను పూర్తిగా చూడకపోయినా అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇంటెరిమ్ ఆర్డర్ ఇవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని జస్టిస్ మాధవీదేవి స్పష్టం చేశారు. నిజానికి ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాలని తొలుత భావించినా, ఆ తర్వాత కొన్ని వందల పేజీల ఆధారాలు, ఎవిడెన్సులు వచ్చాయని, వాటిని లోతుగా పరిశీలించకుండా ఇంటెరిమ్ ఆర్డర్ ఇవ్వాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు వివరించారు.

దాదాపు రెండున్నర గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ విచారణలో ఇరు తరఫున వాదనలను గమనంలోకి తీసుకుని వచ్చే శుక్రవారం ఆర్డర్ ఇస్తానని, ఇప్పుడు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు. నిందితుడు పోలీసు విచారణకు సహకరిస్తారని, సాక్ష్యాధారాలను తారుమారు చేయబోరని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేసినా బెంచ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నిందితుడిపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయంటూ బాధితురాలి తరపు న్యాయవాది పి.నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఆ రెండు కేసులతో ఈ కోర్టుకు సంబంధం లేదని, నిర్దిష్ఠంగా ఈ కేసులోని మెరిట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తుందని జస్టిస్ మాధవీ దేవి స్పష్టం చేశారు.

బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని విషయాలు తనకు తెలియవని, కానీ ఆమె వెల్లడించినట్లు చెప్తున్న కొన్ని అంశాలు ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలకు భిన్నంగా ఉన్నాయని నిందితుడి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వంగానీ, రాష్ట్ర పోలీసులుగానీ తన క్లయింట్ తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పార్టీకి చెందినవని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల్ని ప్రభావితం చేసే అంశమే ఉత్పన్నం కాదని కోర్టుకు వివరించారు. కానీ బాధితురాలి తరపు న్యాయవాది దీనితో ఏకీభవించలేదు. నిందితుడి తండ్రి సమాజంలో ఇన్‌ప్లూయెన్షియల్ వ్యక్తిగా ఉన్నారని, అనుకూలమైన నిర్ణయాన్ని కోర్టు వెల్లడిస్తుందనే అభిప్రాయం ఉన్నదని, అదే తరహా ఆర్డర్ వెలువడితే సమాజం రకరకాలుగా కామెంట్లు చేస్తుందని బాధితురాలి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు.

దీనిపై ఘాటుగానే స్పందించిన జస్టిస్ మాధవీదేవి.. సమాజం ఏమనుకుంటుందనే అంశంతో కోర్టుకు సంబంధం లేదు.. ఆ కోణంలో ఆలోచించదు కూడా.. కానీ కేవలం చట్టం, సాక్ష్యాధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.. అని రిప్లై ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలను లోతుగా విన్న జస్టిస్ మాధవీదేవి.. ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేనని, నిందితుడిగా ఇంటెరిమ్ ప్రొటెక్షన్‌గానీ, ఆయన తరఫు న్యాయవాది కోరినట్లుగా ‘స్టేటస్ కో’ కానీ ఇవ్వలేనని స్పష్టం చేశారు. నిర్ణయాన్ని వచ్చే గురువారం జరిగే విచారణ సందర్భంగా వెల్లడిస్తానని విచారణను వాయిదా వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>