Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రో మోత.. ప్రజలకు వాత..!

కలం, తెలంగాణ బ్యూరో : పెట్రోలు, డీజిల్ ధరలు (Fuel Price Hike) అనూహ్యంగా పెరగడంతో సామాన్యుల జేబులకు చిల్లులు తప్పలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెరగడం ఖాయమనే ప్రజల అంచనాలే నిజమయ్యాయి. అలాంటిదేమీ ఉండదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా అబద్ధాలని తేలిపోయాయి. ఆయిల్ కంపెనీల నిర్ణయం పెట్రోలు, డీజిల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల మొదలు రోజువారీ నిత్యావసరాల వరకు ప్రభావం పడనున్నది. కొన్ని ప్రభుత్వ పథకాల వ్యయంపైనా అదనపు ఒత్తిడి పడనున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి స్కీమ్‌పైనా డీజిల్ ధరల పెంపు ప్రభావం పడుతున్నది. మరో కీలకమైన ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకంపైనా పడి ఆ భారం ప్రభుత్వంపై పడడానికి బదులు లబ్ధిదారులపై పడుతున్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులపైనా ప్రభుత్వం అదనపు చెల్లింపులు చేయక తప్పదు.

వానాకాలం సీజన్‌లో రైతులపై ప్రత్యక్ష ప్రభావం :

డీజిల్ ధర (Fuel Price Hike) పెరగడంతో ఆ ప్రభావం విత్తనాలు, యూరియా, పురుగుమందులు.. ఇలా అన్ని రూపాల్లో రైతులపై పడుతున్నది. ఇప్పటికే యాసంగి పంటకు మార్కెట్ యార్డుల దగ్గర రైతులు లారీల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే హార్వెస్టర్ల అద్దె ఈసారి పెరిగింది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో ఈసారి వానాకాలం పంటలకు నవంబరు, డిసెంబరు నెలల్లో మరింత భారం పడనున్నది. వానాకాలం పంటకు రైతులు సమకూర్చోవాల్సిన యూరియా మొదలు నాట్లు వేసే కూలీలు, కలుపు తీసే పనులకు సైతం అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. వానాకాలం కోతల సమయానికి డీజిల్ ధరలు ఇంకెంత పెరుగుతాయో, వాటికి ఎంత అదనపు ఖర్చు అవసరమవుతుందో తెలియని అయోమయం నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంఎస్పీ రేటు పెంచినా డీజిల్ ధర పెంపు దానికంటే ఎన్నో రెట్లు వేర్వేరు రూపాల్లో చెల్లించుకోవాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపంలో రైతుల్ని ఆదుకుంటుందన్నది కీలకంగా మారింది.

ఆర్టీసీ డీజిల్ ఖర్చుకు ఆల్టర్నేట్‌గా ఈవీ బస్సులు :

డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ బస్సులపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ఆర్టీసీకి ఇకపైన ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ మొత్తం పెరగనున్నది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర సర్కార్ అదనపు చెల్లింపులతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతవరకైనా సర్దుబాటు చేసుకోడానికి ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచితే ప్రజల నుంచి నిరసన వస్తుందన్న అంచనాతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే సాహసం చేయడంలేదు. ఆ కారణంగానే వీలైనంత తొందరగా ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి దించాలనుకుంటున్నది. ఇప్పటికే కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది చివరకు మొత్తం మూడు వేల ఈవీ బస్సులు వస్తాయని ముఖ్యమంత్రి తాజాగా వెల్లడించారు. ఆర్టీసీ ఇప్పటికే కార్గో సర్వీసులను నిర్వహిస్తున్నది. అందులో సరుకు రవాణా ఛార్జీలు కూడా తాజా పెంపుతో పెరిగే అవకాశమున్నది.

నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు :

దేశంలో సరుకు రవాణాలో సుమారు 70% లారీల ద్వారానే జరుగుతున్నది. ఆవి వాడే ప్రధాన ఇంధనం డీజిల్ కావడంతో తాజా పెంపుతో రవాణా ఛార్జీలు సైతం పెరగనున్నాయి. డీజిల్ ధర పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సైతం టికెట్ ధరలను పెంచేశాయి. దీనికి కొనసాగింపుగా లారీల రవాణా ఛార్జీలూ పెరగనున్నాయి. ఆ భారం చివరకు వినియోగదారుడిపైనే పడుతున్నది. దీంతో కూరగాయల మొదలు వంటింట్లో రోజువారీ వాడే ఉప్పు, పప్పు, వంట నూనెలు, బియ్యం.. ఇలా అన్ని వస్తువుల ధరలూ పెరగనున్నాయి. డీజిల్ ధర పెరిగితే మార్కెట్‌లో ధరల గొలుసు మొత్తమే ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, ఒక లారీ హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాలకు సరుకులు తరలించడానికి రోజుకు వినియోగంచే వందల లీటర్ల డీజిల్‌కు లీటరుకు మూడు రూపాయలు పెరిగినా ఒక ట్రిప్‌కు వందల రూపాయల అదనపు ఖర్చు పడుతుంది. దీని ప్రభావంతో పాలు, బియ్యం, పప్పులు, పండ్లు, నిర్మాణ సామగ్రి, సిమెంట్, ఇసుక రవాణా ధరలపై ప్రభావం పడుతుంది.

సామాన్యులకు కనిపించని చైన్ ఎఫెక్ట్ :

పెట్రోలు ధరలు పెరిగితే ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగుల నెలవారీ ఫ్యూయల్ ఖర్చు పెరుగుతుంది. లక్షలాది కుటుంబాలు దీన్ని భరించాల్సి ఉంటుంది. ఈ ప్రభావం ప్రతి నెలా చెల్లించే వివిధ రకాల ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, వారి స్కూల్ బస్సు ఛార్జీ.. ఇలాంటి అంశాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇక వ్యవసాయ రంగంలో డీజిల్ ధరల పెంపు ప్రభావం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మోటార్లు, వ్యవసాయ సరుకు రవాణాపై పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన నిర్మాణ సామగ్రి, రైతులు వాడే వ్యవసాయ యంత్రాల వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులు… వీటిపైనా ప్రభావం పడుతుంది. ఇసుక, సిమెంట్ తదితర భవన నిర్మాణ సామగ్రిపైనా ప్రభావం పడుతుంది. మున్సిపల్ వ్యర్థాల సేకరణ, పాఠశాల, ఆరోగ్య రవాణా సేవలు వీటన్నింటిపైనా పడుతుంది.

Read Also: విదేశి ప్రయాణాలపై ట్యాక్స్‌లు విధించం : మోదీ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>