కలం, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా భావించే ఆర్థిక సర్వే (Economic Survey 2025–26) ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి సమగ్రంగా వివరించారు. అనంతరం దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరు ప్రధాన రంగాలను ప్రస్తావించారు. వాటి స్థితిగతులను క్లుప్తంగా వివరించారు.
రూపాయి విలువ..
ఇటీవల రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీని గురించి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ.. రూపాయి విలువ తగ్గడానికి దేశ ఆర్థిక పరిస్థితులు కారణం కాదన్నారు. ప్రపంచస్థాయి కారకాలే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. విదేశీ మూలధనంపై ఆధారపడి అభివృద్ధి చెందుతున్న భారత్‌పై గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్, మూలధన ప్రవాహాల అస్థిరత ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే, భారత ఆర్థిక పునాది బలంగానే ఉందని చెప్పారు.
ద్రవ్యోల్బణం.. వృద్ధి
ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతో దేశ ఆర్థిక వృద్ధిలో వేగం పెరిగిందని అనంత నాగేశ్వరన్ అన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 7.4శాతానికి చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణమన్నారు. అలాగే, డిసెంబర్ వరకు హెడ్లైన్, కోర్ ద్రవ్యోల్బణం తగ్గడంతో ధరల ఒత్తిడీ తగ్గుతోందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, ఫిస్కల్ కన్సాలిడేషన్ ప్రణాళిక ఇందుకు తోడ్పడుతోందని తెలిపారు. 2025–26లో ఫిస్కల్ లోటు జీడీపీలో 4.4 శాతానికి తగ్గే అవకాశం ఉందని, ప్రైమరీ లోటు కూడా తగ్గిందన్నారు. ఇది ప్రభుత్వానికి ఖర్చుల నిర్వహణలో మరింత వెసులుబాటు ఇస్తుందన్నారు.
ఉపాధి.. మహిళా శక్తి
ఉపాధి రంగంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోందని సీఈఏ చెప్పారు. 2017–18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023–24లో 3.2 శాతానికి తగ్గిందన్నారు. ఇది 2025–26 డిసెంబర్ నాటికి మరింత తగ్గి 4.9 శాతానికి చేరిందని తెలిపారు. మహిళా కార్మిక శక్తి 23.3 నుంచి 41.7 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
వ్యవసాయం..
పశుపోషణ, మత్స్యకార రంగాల వల్ల వ్యవసాయ వృద్ధిలో వైవిధ్యం కనిపిస్తోందని నాగేశ్వరన్ తెలిపారు. 2020–24 మధ్య ఈ రంగాల్లో జీవీఏ వృద్ధి వరుసగా 6.1, 7.2 శాతంగా ఉందన్నారు. మొత్తం వ్యవసాయ రంగంలో ఇది 4.7 శాతం, పంటలలో 4 శాతంగా ఉందన్నారు. అయితే, ఎరువుల విచ్చలవిడి వాడకం, ధాన్యం నిల్వలు పెరగడం, నిల్వ ఖర్చులు, ప్రత్యామ్నాయ పంటలకు సరైన మార్కెట్లు లేకపోవడం వంటి సమస్యలు రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ, ఏఐ, మానసిక ఆరోగ్యం..
ఈ మూడు రంగాల్లో ఎక్కువ సవాళ్లు ఎదురవుతాయని సీఈఏ వెల్లడించారు. హరిత ఇంధనం కోసం భారీగా ఖనిజాలు, లాజిస్టిక్స్ సపోర్ట్, ఇంధన నిల్వ సామర్థ్యం అవసరమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య లోపాలు, ఉద్యోగాలపై ఒత్తిడి, డేటా సెంటర్ల అధిక వనరుల వినియోగం, విదేశీ ఏఐ మోడళ్లపై ఆధారపడటం వంటి ప్రమాదాలున్నాయని హెచ్చరించారు. అలాగే, డిజిటల్ వ్యసనం పెరుగుతోందన్నారు. ముఖ్యంగా యువతలో దీని వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తంగా ఆర్థిక సర్వే (Economic Survey 2025–26) వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఉపాధిలో మెరుగుదల సానుకూలంగా ఉందని సీఈఏ అన్నారు. అయితే వ్యవసాయం, హరిత ఇంధనం, ఏఐ వంటి రంగాల్లో సవాళ్లు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడమే భవిష్యత్‌లో స్థిరమైన వృద్ధికి కీలకమని స్పష్టం చేశారు.


