Mobile Popup Ad
Mobile Popup Ad

పార్ట్‌నర్ లాస్ట్ సీన్ పదే పదే చూస్తున్నారా?..ఈ సమస్యలు తప్పవు!

కలం, వెబ్‌డెస్క్: ఒకప్పుడు ప్రేమలో ఫోన్ కాల్స్ కోసం ఎదురుచూడటం ఉండేది. కానీ ఇప్పుడు, భాగస్వామి డిజిటల్ కదలికలను నిమిష నిమిషానికి గమనించే ‘డిజిటల్ పర్యవేక్షణ’ ఎక్కువైంది. ఈ అలవాటు మొదట్లో కేవలం ఒక సాధారణ ఉత్సుకతలా అనిపించినప్పటికీ, మెల్లమెల్లగా ఇది ఒక తీవ్రమైన వ్యసనంగా, మానసిక ఆందోళనగా (Mental Health) మారుతోంది.

ఒక మంచి డేట్‌కి వెళ్లొచ్చిన తర్వాతో లేక పార్ట్‌నర్‌తో రిలేషన్‌షిప్‌ (Relationship) లో ఉన్నప్పుడో.. అవతలి వ్యక్తి మన మెసేజ్‌కి ఏం రిప్లై ఇస్తారా అని ఎదురుచూడటం సహజం. కానీ, ఫోన్ చేతిలోకి తీసుకుని పదే పదే పార్ట్‌నర్ యొక్క ‘లాస్ట్ సీన్’ చెక్ చేయడం, రిప్లై రాకపోతే కంగారుపడిపోవడం ఈ రోజుల్లో చాలామందిలో కనిపిస్తోంది. ప్రస్తుతం మనల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్న ఈ డిజిటల్ అలవాటు, కేవలం మనశ్శాంతి (Mental Health) ని మాత్రమే కాకుండా మన శారీరక ఆరోగ్యాన్ని కూడా ఎలా దెబ్బతీస్తుందో తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ చిన్న అలవాటు వల్ల కలిగే మానసిక, శారీరక నష్టాల గురించి గురుగ్రామ్‌లోని మార్గ మైండ్‌కేర్ క్లినికల్ సైకాలజిస్ట్ నోయా గిరి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరైతే తమ ఆనందం కోసం, మనశ్శాంతి కోసం పార్ట్‌నర్ లేదా ఇతరుల స్పందనలపై ఎక్కువగా ఆధారపడతారో, వారిలోనే ఈ లాస్ట్ సీన్ చూసే అలవాటు ఎక్కువగా ఉంటుందట.

అవతలి వ్యక్తి నుంచి రిప్లై రావడం ఆలస్యమైతే.. వాళ్లు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, నేనేమైనా తప్పు మాట్లాడానా అంటూ నెగటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. ఈ ఆలోచనలు క్రమంగా ఒక తీవ్రమైన ఆందోళనగా (యాంగ్జైటీగా) మారిపోతాయి. ఈ అలవాటు మనల్ని ఒక ఊబిలా లాగేస్తుందని సైకాలజిస్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తప్పు అని తెలిసినా సరే, మళ్లీ మళ్లీ ఫోన్ లాక్ తీసి చెక్ చేయకుండా ఉండలేరు. ఈ ప్రవర్తన వల్ల కాలక్రమేణా మనుషుల్లో భద్రతా భావం తగ్గిపోతుంది. ఇది నేరుగా వారి నిద్ర, ఏకాగ్రత, మూడ్, ఆత్మవిశ్వాసం , మానసిక ప్రశాంతతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ అలవాటు వల్ల అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతినేది నిద్రే.

ఒక బంధంలో సరైన కమ్యూనికేషన్ లేనప్పుడు, కేవలం లాస్ట్ సీన్ కోసం రాత్రంతా నిద్ర పాడు చేసుకోవడం అస్సలు మంచిది కాదు. నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే నీరసం, తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపించడం , ఎక్కువ ఆహారం తినాలనే కోరికలు కలుగుతాయి. ఇక దీర్ఘకాలిక నష్టాల విషయానికి వస్తే.. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు, ఊబకాయం , మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, గత ఏడాది (2025) సెప్టెంబర్ 30న ప్రచురితమైన ఒక మెడికల్ స్టడీ ప్రకారం.. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు చిన్న వయసులోనే ముసలిదైపోతుందని తేలింది. ఇది భవిష్యత్తులో డిమెన్షియా వంటి మతిమరుపు వ్యాధులకు దారితీస్తుంది.

అయితే, దీనికి ఒక సానుకూల కోణం కూడా ఉందని సైకాలజిస్ట్ గుర్తు చేశారు. పార్ట్‌నర్ రిప్లై ఇవ్వడం ఆలస్యమైతే దానికి అర్థం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని కాదు. వాళ్లు ఏదైనా పనిలో బిజీగా ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు లేదా ఒత్తిడిలో ఉండి ఉండొచ్చు. కానీ ఆందోళనలో ఉన్నప్పుడు మన మనస్సు ఎప్పుడూ చెడు విషయాలనే ముందుగా ఆలోచిస్తుంది. ఆరోగ్యకరమైన బంధాలు ఎప్పుడూ నమ్మకం, ఓపిక, పరస్పర అవగాహన , మానసిక బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటాయి తప్ప, ఒకరినొకరు నిరంతరం గమనించడం (మానిటరింగ్) పై కాదు. కాబట్టి మనం ఒకరి లాస్ట్ సీన్‌ని వారిపై ఉన్న ఇష్టంతో చూస్తున్నామా లేక మనలోని ఆందోళనను తగ్గించుకోవడానికి చూస్తున్నామా అనేది ఆలోచించుకోవడం మంచిది.

Read Also: నేరేడు పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>