కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జనగనణ (Census) కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టడంతో రాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. ఈ ఏడాది ఏప్రిల్ ఫస్ట్ నుంచి సెప్టెంబరు 30 వరకు అన్ని రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే (House Listing) జరగనుండడంతో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామం మొదలు నగరం వరకు అన్ని చోట్లా ఇండ్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని సైతం ప్రభుత్వం సమకూర్చనున్నది. మొత్తం ఆరు నెలల పాటు జరిగేలా రూపొందించిన షెడ్యూలులో నిర్దిష్టంగా ఒక రాష్ట్రం 30 రోజుల్లోనే లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం ఆరు నెలలు కేటాయించినా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రం ఒక్కో నెలను ఎంచుకుంటుంది.
స్వచ్ఛందంగానూ వివరాల వెల్లడి :
సెన్సస్ సిబ్బంది లాంఛనంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్యలో ఇంటింటి సర్వే ద్వారా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియను కంప్లీట్ చేయనున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా వారి ఇండ్ల వివరాలను ఇవ్వడానికి కూడా రిజిస్ట్రార్ జనరల్ వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్ ఫస్ట్ న హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ (House Listing Census) ప్రారంభం కావడానికి ముందే స్వచ్ఛంద వివరాల వెల్లడికి షెడ్యూలు వెలువడుతుంది. పదిహేను రోజుల పాటు ఈ అవకాశం ఉండనున్నట్లు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: ‘తెలంగాణ ఫస్ట్..’ నినాదం వెనుక.. మర్మమేమిటి?
Follow Us On: Youtube


