epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

ట్రాఫిక్​ కష్టాలకు​ చెక్​.. హెచ్​ఎండీఏ భారీ ప్రణాళిక

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చి, ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో పలు ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.

రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వెల్​ లో దాదాపు 488 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణం కానుంది. రేడియల్ రోడ్ సంఖ్య 2ను ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించేలా దీనిని రూపొందించారు. ఈ ఇంటర్‌చేంజ్ పూర్తయితే గచ్చిబౌలి, శంషాబాద్ విమానాశ్రయం, బుడ్వెల్ లేఅవుట్‌ల మధ్య ట్రాఫిక్ సాఫీగా సాగడంతో పాటు, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ఇది ఒక కీలక ద్వారంగా నిలవనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి.

బంజారాహిల్స్, హైటెక్ సిటీ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్ 3 నిర్మించనున్నారు. సుమారు 1,656 కోట్ల రూపాయల వ్యయంతో ఐసీసీసీ టవర్ నుండి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ రహదారిని నిర్మిస్తారు. ఇది రెండు దశల్లో అమలు కానుంది. మొదటి దశలో ఫిల్మ్‌నగర్ నుండి శిల్పా లేఅవుట్ వరకు, రెండో దశలో ఐసీసీసీ నుండి హకీంపేట్ కుంట వరకు పనులు జరుగుతాయి. ఈ మార్గంలో టీ హబ్, ఐటీసీ కోహెనూర్ వంటి కీలక జంక్షన్ల వద్ద ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ శాఖ భూముల క్లియరెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశారు.

మణికొండ, కోకాపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎంజీఐటీ నుండి మణికొండ వరకు పైప్‌లైన్ రోడ్డును 110 కోట్ల రూపాయలతో విస్తరించనున్నారు. సుమారు 3.57 కిలోమీటర్ల పొడవునా 6 లేన్ల రహదారిని, రెండు వైపులా డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడుతున్న బాటిల్‌నెక్‌లను తొలగించడానికి నానక్రామ్‌గూడ నుండి గచ్చిబౌలి వరకు ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు ప్రధాన రహదారిని మూడు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>