జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌పై హత్యాయత్నం..!

క‌లం, వెబ్ డెస్క్‌: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah)పై బుధవారం రాత్రి జరిగిన హత్యాప్రయత్నం కలకలం రేపింది. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన ఒక వివాహ వేడుకకు అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి హాజరయ్యారు. వేడుక ముగించుకొని వారు బయటకు వస్తున్న సమయంలో, ఒక దుండగుడు అతి సమీపం నుంచి ఫరూక్ అబ్దుల్లాను కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకోవ‌డంతో పెను ప్రమాదం తప్పింది.

పట్టుబడిన నిందితుడిని పురానీ మండికి చెందిన కమల్ సింగ్ జమ్వాల్ (63)గా గుర్తించారు. పోలీసుల విచారణలో అతను షాకింగ్ విషయాలు వెల్లడించాడు. గత 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పాడు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కానీ పని కాలేద‌ని నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వ‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి వెనుక కారణాలు ఏమిట‌న్న‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ సీఎంకు స‌ద‌రు వ్య‌క్తి అంత దగ్గరగా ఎలా రాగలిగాడు? అనే విషయంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భద్రతా పరంగా జరిగిన పెద్ద వైఫల్యమని డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి కూడా విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>