Mobile Popup Ad
Mobile Popup Ad

దంచికొడుతున్న ఎండలు.. వైద్యుల సూచనలు ఇవే..

కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్‌ (Warangal) జిల్లాపై సూర్యుడు ఆగ్రహజ్వాలలు కురిపిస్తున్నాడు. సూర్య ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్‌తో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ప్రధానంగా రోజువారీ కూలీలు, ఉపాధిహామీ పనులకు వెళ్లే వారు ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి.

దంచికొడుతున్న ఎండలు

ఈ నెలలో వరంగల్ (Warangal) ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. ఈ ఏడాది 46 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలు హీట్‌వేవ్ జోన్‌లో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ దంచి కొడుతుండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. అత్యవసర పనులున్న వాళ్లు ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసుకుని ఇంటిబాట పడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 32 డిగ్రీలకు తగ్గకపోవడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

భయపెడుతున్న వడదెబ్బ మరణాలు

దంచికొడుతున్న ఎండలతో రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలోని ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు రోజుకు 30-40 వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వడదెబ్బ (Heatwave) బారిన పడి సుమారు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్న పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. మద్యం ప్రియులు సైతం వేళాపాళా లేకుండా మద్యం సేవించడం వల్ల శరీరంలో నీరు త్వరగా ఆవిరైపోయి మృత్యువుకు దగ్గరవుతున్నారు.

పెరిగిన ఏసీ, కూలర్ల వినియోగం

రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు జనం ఉపశమనం కోరుకుంటున్నారు. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వేల రూపాయలు పెట్టి ఏసీలు, కూలర్లు కొనలేని వారు మట్టి కుండలలపై ఆధారపడుతున్నారు.

ఉదయం 11 దాటితే బయటకు రావొద్దు

ఎండలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దని పేర్కొంటున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, కాటన్ బట్టలు ధరించి బయటకు వెళ్లాలని చెబుతున్నారు. వేసవి తాపానికి దాహం వేయకపోయినా ప్రతి అరగంటకు గ్లాసు నీళ్లు తాగాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం కూడా మంచిదని పేర్కొంటున్నారు. మద్యం, కూల్‌డ్రింక్స్ లాంటి పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ గదిలో గాలి ఆడేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.

Read Also: 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ప్రజలు జాగ్రత్త: పొంగులేటి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>